ATA Celebrations in USA: వాషింగ్టన్‌ డీసీలో అబ్బుర పరిచిన ఆటా వేడుకలు.. తెలుగువారి కేరింతలు

ATA Celebrations : అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ - ఆటా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలను నిర్వాహకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

Written by - Saptagiri | Last Updated : Jul 8, 2022, 02:58 AM IST
  • - వాషింగ్టన్‌ డీసీలో ఆటా సంబరాలు
    - రికార్డు స్థాయిలో పాల్గొన్న ప్రతినిధులు
    - మాతృదేశానికి సేవ చేస్తామన్న ఆటా అధ్యక్షుడు
ATA Celebrations in USA: వాషింగ్టన్‌ డీసీలో అబ్బుర పరిచిన ఆటా వేడుకలు.. తెలుగువారి కేరింతలు

ATA Celebrations in Washington DC: అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ - ఆటా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలను నిర్వాహకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కరోనా మహమ్మారి కాలం తర్వాత మొదటి సారి జరిగిన ఈ ఉత్సవాలకు తెలుగు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమాల్లో 15వేల మందికి పైగా పాల్గొన్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఉత్సవాల్లో సద్గురు జగ్గీ వాసుదేవ్‌ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. జూలై 1వ తేదీన నిర్వహించిన బాంక్వెట్‌ డిన్నర్‌లో 3వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ డిన్నర్‌లో అలనాటి క్రికెట్‌ ప్రముఖులు సునీల్‌ గవాస్కర్‌, కపిల్‌ దేవ్‌, క్రిస్‌గేల్‌ కూడా పార్టిసిపేట్‌ చేశారు. ఉత్సవాలకు ఆహ్వానించగానే ప్రత్యేకంగా వచ్చిన ప్రముఖులను ఆటా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. 

ఆటా ఉత్సవాల్లో భాగంగా జూలై 1వ తేదీన నిర్వహించిన గోల్ఫ్‌ టోర్నమెంట్‌లో సద్గురు జగ్గీ వాసుదేవ్‌ సహా రకుల్‌ ప్రీత్‌సింగ్‌, కపిల్‌దేవ్‌ తమ పెర్ఫార్మెన్స్‌ చూపించారు. ఉత్సవాలకు హాజరైన వాళ్లందరూ చిన్నా, పెద్దా, మహిళలు, పురుషులు, తెలుగు సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. అంతేకాదు.. 'తెలుగు మన వెలుగు' పేరుతో ప్రత్యేక కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 140 మంది కళాకారులు పాల్గొన్నారు. కూచిపూడి, లంబాడి, గోండి వంటి సంప్రదాయ నృత్యరూపకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీ కృష్ణ రాయబారం నాటకం ఆహూతులను మంత్రముగ్ధులను చేసింది. 

తెలంగాణ ప్రఖ్యాత వేడుక బతుకమ్మపై ఆటా ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వద్దిపర్తి పద్మాకర్‌ అవధానం అందరినీ ఆలోచింపజేసింది. అంతేకాదు.. ఆహూతులను శివమణి, థమన్‌ మ్యూజికల్‌ నైట్‌ ఉర్రూతలూగించింది. శివమణి.. డ్రమ్స్‌పై చేసిన విన్యాసం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. శ్రోతల తరపున సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు ఉపాసన కామినేని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ఉత్సవాలకు సింగర్‌ సునీత, మగ్దూం సయ్యద్‌, రవి రాక్లే వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. 

తొలిరోజు ఆటా సాహిత్య కార్యక్రమాల్లో కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, కె.శ్రీనివాస్‌, ప్రముఖులు అఫ్సర్‌, ప్రభావతి , స్వామి వెంకటయోగి తదితరులు ప్రసంగించారు. పేరడీ పాటలతో జొన్నవిత్తుల అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు. అమెరికాలోని కఠా, నవలా రచయితల కోసమే మానకాలపు నవల, కథ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. 
    
రెండోరోజు సాహిత్య కార్యక్రమాల్లో సినిమాలు, సాహిత్యానికి ఉన్న సంబంధం గురించి వివరించే ఉద్దేశ్యంతో 'సినిమా కథ-సాహిత్య నేపథ్యం' పేరుతో చర్చాగోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తనికెళ్ల భరణి, సందీప్‌రెడ్డి, ధర్మ దోనెపూడి, సుకుమార్‌, శివ సోమయాజుల తదితరులు పాల్గొన్నారు. 'ఆటా పాటా మనం' పేరుతో చంద్రబోసు, రామజోగయ్య శాస్త్రి తమ పాటల నేపథ్యాన్ని ప్రేక్షకులకు వివరించారు.

చివరిరోజైన జూలై 3వ తేదీన టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాస కల్యాణంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.  పలు పోటీల్లో విజేతలకు రకుల్‌ ప్రీత్‌సింగ్‌, అడివి శేష్‌ బహుమతులు అందజేశారు. ఈ ఉత్సవాలకు అమెరికాలోని 12 నగరాల నుంచి ఔత్సాహికులు తరలివచ్చారు. ఝుమ్మంది నాదం పేరుతో పాటల పోటీలు, సయ్యది పాదం పేరుతో నాట్య పోటీలు నిర్వహించగా.. 300 మంది పోటీల్లో పాల్గొన్నారు. బిజినెస్‌ కమిటీ ఆధ్వర్యంలో ఎంటర్‌ప్రెన్యూర్‌ షిప్‌ అండ్‌ లైఫ్‌ సైకిల్‌ కార్యక్రమంలో జీఎంఆర్‌ సంస్థల అధినేత గ్రంథి మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం నిర్వహించిన సదస్సులో ఉపాసన కామినేని పాల్గొన్నారు. 

తెలంగాణ మంత్రులు నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డితో పాటు.. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, కాలే యాదయ్య, బొల్లం మల్లయ్య యాదవ్‌, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, గాదరి కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహా.. పలు పార్టీల నేతలు భాను ప్రకాష్‌రెడ్డి, పటేల్‌ రమేష్‌ రెడ్డి, మన్నవ సుబ్బారావు, భవాని మారికంటి తదితరులు పాల్గొన్నారు. ఇక, రామచంద్రమిషన్‌ ధ్యాన గురువు దాజి ప్రత్యేక సందేశాన్ని అందించారు. 

ఆటా మహాసభలను దిగ్విజయ వంతంగా నిర్వహించేందుకు ఆర్థికంగా సహకరించిన దాతలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ప్రైమ్‌ హెల్త్‌ కేర్‌ సర్వీసెస్‌ అధినేత చేస్తున్న సేవలకు గానూ డాక్టర్‌ ప్రేమ్‌సాగర్‌రెడ్డికి ఆటా జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు భువనేష్‌ భుజాల, పూర్వ అధ్యక్షుడు పరమేష్‌ భీంరెడ్డి, తదుపరి అధ్యక్షుడు మధు బొమ్మినేని పాల్గొన్నారు.

Also read : YSR Jayanthi 2022: వైఎస్ఆర్ జయంతి.. వైఎస్ఆర్‌కి ఎందుకంత ఫ్యాన్ ఫాలోయింగ్ ? వైయస్ఆర్ డెత్ మిస్టరీ ఏంటి ?

Also read : AP, Telangana Rain Updates: ఏపీ, తెలంగాణలో భారీవర్షాలు.. వాతావరణ శాఖ నివేదిక

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News