వీసాల గడువు ముగిసినా దాదాపు 21 వేలమంది భారతీయులు అమెరికాలో ఉన్నారని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) బుధవారం ప్రకటనను విడుదల చేసింది. అయితే మిగతా దేశాలతో పోల్చితే వీసాల గడువు ముగిసినా..అమెరికా నుండి వెళ్లని ఇండియన్స్ సంఖ్య తక్కువగానే ఉందని డీహెచ్ఎస్ తెలిపింది. అయితే అలా వీసాలు లేకుండా అమెరికాలో ఉంటున్న దేశాల టాప్ టెన్ లిస్టులో భారత్ కూడా స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.
ముఖ్యంగా ఇలా వీసా చిక్కులలో ఉన్నవారిలో ఎక్కువశాతం మంది విద్యార్థులు కావడం గమనార్హం. 2017లో 1,27,435 మంది ఇండియన్ విద్యార్థులు అమెరికాకు రాగా.. 4,400 మంది విద్యార్థులు వీసా గడువు ముగిసినా.. ఇంకా అమెరికాలోనే ఉన్నారని సమాచారం. అలాగే ఈ జాబితాలో పర్యాటకులు కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. టూరిస్ట్ వీసాల పై అమెరికాకి వచ్చి గడువు ముగిసినా కూడా వెళ్లకుండా.. ఇంకా అదే దేశంలో కాలక్షేపం చేస్తున్న వారి జాబితాను కూడా ఇటీవలి కాలంలో డీహెచ్ఎస్ సేకరించింది.
ఈ తాజా జాబితా ప్రకారం.. 2017లో 10.7 లక్షల మంది ఇండియన్స్ బిజినెస్, టూరిజం విభాగాల్లో వీసాల కోసం దరఖాస్తు చేసి.. ఆ తర్వాత తమకు లభించిన బీ1, బీ2 వీసాలపై అమెరికాను సందర్శించారు. వీరిలో 14,204 మంది వీసా గడువు ముగిసినా కూడా ఇంకా అమెరికా విడిచి వెళ్లలేదని సమాచారం. ఇలా అమెరికా వచ్చిన వారిలో అనేకమంది అక్రమంగా కూడా నివాసముంటున్నట్లు తమకు తెలిసిందని డీహెచ్ఎస్ తెలిపింది. అలాంటి వారిపై చట్టరీత్యా కూడా యాక్షన్ తీసుకుంటామని కూడా ట్రంప్ సర్కారు తెలిపింది.