తెలుగు హీరోయిన్స్‌కి వీసా తిరస్కరిస్తున్న అమెరికా ?

Last Updated : Jul 27, 2018, 01:49 PM IST
తెలుగు హీరోయిన్స్‌కి వీసా తిరస్కరిస్తున్న అమెరికా ?

పాటల చిత్రీకరణ కోసమో లేక కథలో భాగంగా పలు సన్నివేశాలను తెరకెక్కించడం కోసమో తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలు ఎంతోమంది అమెరికా బాటపట్టడం ఎప్పటి నుంచో చూస్తున్నదే. అయితే, ఇటీవల కాలంలో అలా అమెరికా వెళ్లాల్సి వచ్చే తెలుగు సినిమా హీరోయిన్స్‌కి అమెరికా వీసా లభించడం కష్టతరంగా మారిందంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. తాజాగా రాజశేఖర్-జీవిత దంపతుల గారాలపట్టి శివాని రాజశేఖర్‌కి అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం వీసా తిరస్కరించడమే అందుకు ఓ నిదర్శనం అని సినీవర్గాలు చెబుతున్నాయి. అవును, 2 స్టేట్స్ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్న శివాని రాజశేఖర్‌కు అమెరికా వీసా ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలుస్తోంది. 2 స్టేట్స్ సినిమా చిత్రీకరణ కోసం అమెరికా వెళ్లాలనుకున్న మూవీ యూనిట్ సభ్యులు వీసాకు దరఖాస్తు చేసుకున్నారు.

అయితే, దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమందికి వీసా మంజూరు చేసిన అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం.. శివాని రాజశేఖర్ సహా ఇంకొంత మంది మహిళా ఆర్టిస్టులకు వీసాను నిరాకరించింది. అందుకు కారణం ఏంటా అని ఆరాతీస్తే, ఇటీవల టాలీవుడ్‌కి చెందిన పలువురు హీరోయిన్స్, ఆర్టిస్టులతో అమెరికాలో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ఓ దంపతుల ముఠా పట్టుబడటమే అని తెలిసిందంటున్నాయి సినీవర్గాలు. 

అమెరికాలో సెక్స్ రాకెట్ ఉదంతం అనంతరం అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం తెలుగు హీరోయిన్స్‌కి వీసా మంజూరు చేసే విషయంలో కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నాయని ఆ చిత్ర యూనిట్ సభ్యులు ఆందోళన వ్యక్తంచేసినట్టు సమాచారం. శివాని రాజశేఖర్ విషయంలో ఎటువంటి అవకతవకలు, అనుమానాలు లేనప్పటికీ.. తెలుగు హీరోయిన్స్ అంటేనే అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యురిటీ విభాగం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నట్టుగా వారు చెబుతున్నారు.

Trending News