మోదీ పాలనపై విదేశీ ఆర్థిక నిపుణుడి సునిశిత విమర్శలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై విదేశీ ఆర్థిక నిపుణుడు జీన్ డ్రీజ్ సునిశిత విమర్శలు చేశారు. 

Last Updated : Jul 8, 2018, 06:13 PM IST
మోదీ పాలనపై విదేశీ ఆర్థిక నిపుణుడి సునిశిత విమర్శలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై విదేశీ ఆర్థిక నిపుణుడు జీన్ డ్రీజ్ సునిశిత విమర్శలు చేశారు. మోదీ ప్రభుత్వం ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకొనే బదులు.. అభివృద్ది విషయంలో కాస్త విస్తృతంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక రంగంపై అనేక పరిశోధనలు చేసిన జీన్ డ్రీజ్ మోదీ సర్కార్ తన బాధ్యతలను మర్చిపోయి.. అనేక రంగాల్లో ప్రభుత్వ చొరవను ప్రోత్సహించాల్సింది పోయి కార్పొరేట్ కంపెనీలకు లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ బాధ్యతలను అప్పగిస్తోందని సునిశిత విమర్శలు చేశారు.
 
పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొనే పలు నిర్ణయాలు, పేదవారికి, ధనికులకు మధ్య ఉండే దూరాన్ని తగ్గించడానికి బదులు పెంచడానికి కారణమవుతున్నాయని డ్రీజ్ అభిప్రాయపడ్డారు. అందుకే ప్రభుత్వం సామాన్య ప్రజానీకానికి నాణ్యమైన జీవన ప్రమాణాలను అందించే విధంగా కృషి చేయాలని ఆయన తెలిపారు. 
 
ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, పోషకాహారం, సామాజిక భద్రత, పర్యావరణ పరిరక్షణ, ప్రజా రవాణా మొదలైన విషయాల్లో ప్రమాణాలు మెరుగుపడేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని డ్రీజ్ తెలిపారు. ముఖ్యంగా నాణ్యమైన విద్యను అందించే విషయంలో ప్రభుత్వం కార్పొరేట్ రంగానికి అధికారం ఇచ్చే బదులు స్వయంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డ్రీజ్ అభిప్రాయపడ్డారు.
 
అలాగే ప్రాథమిక విద్యా విధానాల్లో కూడా మెరుగైన ప్రమాణాలు విద్యార్థులకు అందించాల్సిన అవసరం ఉందని డ్రీజ్ తెలిపారు. గడచిన అయిదు సంవత్సరాల్లో బడుగు వర్గాల జీవన ప్రమాణాల్లో అంత చెప్పుకోదగ్గ మెరుగుదల ఏమీ కనిపించలేదని డ్రీజ్ భావించారు. అలాగే నోట్ల రద్దు విధానం వలన ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఒరిగిందేమీ లేదని అన్నారు.

Trending News