ఛార్లెస్ శోభరాజ్. నేర ప్రపంచంలో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. భారతీయ మూలాలు కలిగిన ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ ఇతడు. త్వరలో ఖాట్మండూ జైలు నుంచి విడుదల కానున్నాడు. ఆ వివరాలు మీ కోసం..
కరడు గట్టిన హంతకుడు, ఫ్రాన్స్ దేశానికి చెందిన సీరియల్ కిల్లర్ ఛార్లెస్ శోభరాజ్. 19 ఏళ్లుగా నేపాల్‌లోని ఖాట్మండూ జైళ్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఉత్తర అమెరికాకు చెందిన ఇద్దరు పర్యాటకుల్ని చంపిన కేసులో 2003లో ఛార్లెస్ శోభరాజ్‌ను నేపాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు 21 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో..అప్పటి నుంచి ఖాట్మండూ జైళ్లోనే ఉన్నాడు. గతంలో ఢిల్లీలోని హోటల్‌లో ఓ ఫ్రెంచ్ పౌరుడికి విషమిచ్చి చంపిన కేసులో 1976లో అరెస్టయ్యాడు. 1997 వరకూ ఇండియాలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవించాడు.
ఎవరీ ఛార్లెస్ శోభరాజ్
భారతీయుడికి, వియత్నాం మహిళకు జన్మించిన ఛార్లెస్ శోభరాజ్ చిన్నతనం నుంచే నేరాల బాట పట్టాడు. తల్లిదండ్రులు చిన్నప్పుడు విడిపోవడం, శోభరాజ్‌ను నిర్లక్ష్యం చేయడం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. 1970లో ఆగ్నేయాసియా దేశాల్లో వరుస హత్యలు, దోపిడీలతో ప్రపంచవ్యాప్తంగా పేరు మార్మోగిపోయింది. 20కు పైగా హత్య కేసుల్లో నిందితుడు. శోభరాజ్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో సినిమా కూడా వచ్చింది. 'మే ఔర్ ఛార్లెస్' పేరుతో 2015లో విడుదలైన ఈ చిత్రంలో శోభరాజ్ పాత్రను రణదీప్ హుడా పోషించాడు.
78 ఏళ్ల ఛార్లెస్ శోభరాజ్ అనారోగ్య కారణాలతో విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నాడు. శిక్షాకాలం కంటే ఎక్కువ జైల్లో గడిపానని తెలిపాడు. నేపాల్‌లో సీనియర్ సిటిజెన్లకు ఇచ్చిన సడలింపు ప్రకారం తాను పూర్తి కాలం శిక్షను అనుభవించానని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. 75 శాతం శిక్ష అనుభవించి, సత్ప్రవర్తన కలిగి ఉన్న ఖైదీలను విడుదల చేసేందుకు నేపాల్‌లో చట్టపరమైన నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను విడుదల చేయాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. 15 రోజుల్లోగా స్వదేశానికి పంపించాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించింది.
Also read: India Population: మరో నాలుగు నెలల్లో చైనాను దాటిపోనున్న ఇండియా జనాభా, ఇవీ కారణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook