ఇకపై రైలు ఆలస్యమైతే... ప్రయాణికులకు నీరు, ఆహారం పంపిణీ

భోజనం సమయంలో రైలు ఆలస్యమైనట్టయితే, ప్రయాణికులకు నీరు, ఆహారం సరఫరా : రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్

Last Updated : Jun 18, 2018, 04:47 PM IST
ఇకపై రైలు ఆలస్యమైతే... ప్రయాణికులకు నీరు, ఆహారం పంపిణీ

భోజనం సమయంలో రైలు ఆలస్యమైనట్టయితే, ప్రయాణికులకు నీరు, ఆహారం సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్. రైల్వే సేవల్లో నాణ్యత, స్వచ్ఛత పాటించడంలో భాగంగా భారతీయ రైల్వే తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ కొత్త పాలసీని తీసుకొస్తున్నట్టు మంత్రి చెప్పారు. సమయపాలన, స్వచ్ఛత, కేటరింగ్ సేవలను పరిగణనలోకి తీసుకుని ఏడు రైల్వే జోన్లలో సమీక్షలు నిర్వహించాం అని చెబుతూ... ఎక్కడెక్కడైతే రైలు ఆలస్యం అవుతుందో అక్కడక్కడ ప్రయాణికులకు నీరు, ఆహారం అందించడం జరుగుతుందని మంత్రి పీయుష్ గోయల్ అన్నారు. దేశ వ్యాప్తంగా రైల్వే సేవల ప్రమాణాలు పెంచి స్వచ్ఛత తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న భారతీయ రైల్వే... ఈ మహాయజ్ఞంలో ప్రయాణికుల భాగస్వామ్యం కూడా కోరుకుంటోంది అని వివరించారు. అందులో భాగంగానే వారికి అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి తెలిపారు. 

అయితే, ఓ వైపు మెరుగైన సేవల కోసం చేసే ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు భద్రతకు కూడా పెద్ద పీట వేయనున్నాం అని అన్నారు.. ఏదేమైనా ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి తేల్చిచెప్పారు. రైల్వే భద్రత కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా త్వరలోనే రైళ్లలో డ్రోన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మంచు కురిసే సందర్భాల్లో రైల్వే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నందున ప్రమాదాల నివారణ కోసం ఈ డ్రోన్స్ వ్యవస్థ బాగా ఉపయోగపడుతుంది. రైల్వే స్టేషన్స్‌లోని ప్రయాణికుల భద్రత కోసం సైతం డ్రోన్స్‌ని ఏర్పాటు చేస్తాం. అలాగే రైళ్లలో సరఫరా చేసే ఆహారంలో నాణ్యత విషయంలో రాజీ పడకూడదు అని మంత్రి పీయుష్ గోయల్ కేటరర్లను ఆదేశించారు.

Trending News