గుజరాత్ ఎన్నికల్లో వేడి పెరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు పెరుగుతుంటే..నరోదా అసెంబ్లీ స్థానం విషయంలో బీజేపీ ఇరకాటంలో పడుతోంది. అయితే బీజేపీ ఆ నిర్ణయాన్ని సమర్ధించుకుంటోంది..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో 2002 గుజరాత్ అల్లర్లు, హింసాత్మక దాడుల అంశం హాట్ టాపిక్‌గా మారుతోంది. అహ్మదాబాద్‌కు చెందిన నరోదా పాటియా ప్రాంతంలో 2022లో జరిగిన అల్లర్లలో 97 మంది ముస్లింలు ఊచకోతకు గురయ్యారు. ఈ అల్లర్లకు సంబంధించి 16 మంది దోషుల్లో ఒకడు మనోజ్ కులకర్ణి. ఇప్పుడు బీజేపీ..మనోజ్ కులకర్ణి కుమార్తె పాయల్ కులకర్ణికి నరోదా అసెంబ్లీ సీటు కేటాయించడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే బీజేపీ గుజరాత్ ఛీఫ్ సీఆర్ పాటిల్ మాత్రం నరోదా అసెంబ్లీ సీటు విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించుకుంటోంది. నాటి గుజరాత్ అల్లర్లలో దోషి అయిన మనోజ్ కులకర్ణి కుమార్తె 30 ఏళ్ల పాయల్ కులకర్ణి..మెరిట్ ఆధారంగానే సీటు దక్కించుకున్నారని సీఆర్ పాటిల్ చెబుతున్నారు. నాటి అల్లర్లలో 97 మంది ముస్లింల ఊచకోత కేసులో దోషులైన 16మందిలో ఒకడైన మనోజ్ కులకర్ణి కుమార్తె అయిన పాయల్ కులకర్ణి వృత్తిరీత్యా ఎనస్థీషియా వైద్యురాలు.
కోర్టు ఆదేశాల ప్రకారం మనోజ్ కులకర్ణి ఆ కేసులో జైలుశిక్ష పూర్తి చేసుకన్నారని..అతని కుమార్తె స్వతహాగా ఓ డాక్టర్ అని సీఆర్ పాటిల్ సమర్ధించుకొచ్చారు. అంతేకాకుండా ఆ సంఘటన జరిగి 10-15 ఏళ్లైపోయిందని తెలిపారు. ఈరోజు ఆమె ఈ స్థానంలో పోటీ చేసి గెలిచేందుకు సమర్ధురాలని అన్నారు. ఆమె పార్టీ కార్యకర్త అని..మెరిట్ ఆధారంగానే ఆమెకు టికెట్ కేటాయించామని బీజేపీ సమర్ధిస్తోంది.
సూరత్ తూర్పు నియోజకవర్గానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధిని కిడ్నాప్ చేయడం, నామినేషన్ ఉపసంహరణకు బీజేపీ కారణమని ఆప్ ఆరోపించింది. ఈ ఆరోపణల్ని బీజేపీ ఛీఫ్ సీఆర్ పాటిల్ ఖండించారు. తమ పార్టీపై నిందలు వేయకుండా..అతని పార్టీ నామినేషన్లను సంరక్షించుకోవాలని సూచించారు. కిడ్నాప్, బలవంతపు నామినేషన్ ఉపసంహరణలకు పాల్పడాల్సిన అవసరం బీజేపీకు లేదన్నారు. సూరత్ తూర్పు స్థానం నుంచి బీజేపీ 25 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తోందన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook