తెలుగు రాష్ట్రాల్లో సోమవారం, మే 28వ తేదీ నుండి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం తొలిరోజు నుంచే ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లింపునకు అవకాశం ఉంటుంది. తెలంగాణలో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ 28వ తేదీ నుంచి ప్రారంభమై.. అదేరోజు కళాశాలలు, సీట్ల కోసం వెబ్ కౌన్సెలింగ్ కొనసాగుతుంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని అధికారులు పేర్కొంటున్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
తెలంగాణ షెడ్యుల్ ఇలా:
ఈనెల 28వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉండగా.. వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ అదేరోజు నుంచి జూన్ 5వ తేదీ వరకు కొనసాగుతుంది. విద్యార్థులకు సీట్లను జూన్ 8వ తేదీన కేటాయిస్తారు. మే 28వ తేదీన ఒకటో ర్యాంకు నుంచి 10వేల ర్యాంకు, మే 29న 10,001వ ర్యాంకు నుంచి 25వేల ర్యాంకు, మే 30న 25,001వ ర్యాంకు నుంచి 40వేల ర్యాంకు, మే 31న 40,001వ ర్యాంకు నుంచి 54వేల ర్యాంకు, జూన్ 1న 54,001వ ర్యాంకు నుంచి 68వేల ర్యాంకు, జూన్ 2న 68,001 నుంచి 82వేల ర్యాంకు, జూన్ 3న 82,001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు పొందిన విద్యార్థుల వరకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఏపీ షెడ్యుల్ ఇలా:
ఏపీలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఎంసెట్-2018 కౌన్సెలింగ్ ప్రక్రియ 28నుంచి ప్రారంభం కానుంది. 288 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో 1,46,458 సీట్లను, 11 ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల్లో 3,370సీట్లను భర్తీ చేసేందుకు ఉన్నత విద్యామండలి అనుమతినిచ్చింది. విద్యార్థులు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తులను పంపాలి. కుల, ఆదాయ, స్థానికత ధ్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయాలి. రేపటి నుండి ఈ నెల 30 వరకు ఆన్ లైన్ లో ఫీజు చెల్లింపులు చేసుకోవచ్చు. మే 30, 31 తేదీల్లో 1 నుంచి 60వేల ర్యాంక్, జూన్ 1,2 తేదీల్లో 60,001 నుంచి ఆఖరి ర్యాంక్ వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని.. ఏదైనా సందేహాలు ఉంటే 0884-2340535,2356255 నెంబర్లను సంప్రదించాలని కన్వీనర్ పండాదాస్ తెలిపారు.
సమర్పించాల్సిన పత్రాలు
కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్, ర్యాంకు కార్డు, పదో తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు, ఆరు నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఆదాయ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, ఇంటర్ టీసీతో హాజరు కావాలి.