మన తెలుగు తేజం, మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెండ్ల రచయిత అవతారం ఎత్తబోతున్నాయి. ఈ మాట వింటుంటే ఆశ్చర్యమేస్తోంది కదూ...? ఇది ముమ్మాటికి నిజమండి... వివరాల్లోకి వెళ్లినట్లయితే మీకే అర్థమౌతుంది. ' హిట్ రిఫ్రెస్ ' పేరిట మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెండ్ల పుస్తకాన్ని రాస్తున్నారు. ఈ నెల 26వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ పుస్తకం విడుదల కానుంది. ఈ విషయాన్ని సత్యనాదెండ్ల స్వయంగా తన లింక్డ్ఇన్ లో పోస్టు చేశారు.
' హిట్ రిఫ్రెస్ 'లో ఏముంది..?
' హిట్ రిఫ్రెస్ ' పుస్తకం ఎందుకు రాయదల్చుకున్నారో..దానికి దారి తీరిన పరిణామాలను లింక్డ్ఇన్ లో సత్యనాదెండ్ల వివరించారు. ఈ పుస్తకంలో తన జీవిత చరిత్ర గురించి వివరించారు. మైక్రోసాఫ్ట్‌లో ఒక మూల ఉన్న ఆఫీసు నుంచి మొదలైన తన ప్రస్థానాన్ని తెలియజేశారు. వీటితో పాటు ప్రస్తుత తరుణంలో సాంకేతికత మార్పుల ఆవస్యకతను వివరించారు. సాంకేతికతలో మార్పులు వస్తున్నప్పటికీ..మనం ఉన్న చోట ఆగిపోతే సమాజాల్లో, జీవితాల్లో, ఆర్థిక వ్యవస్థల్లో అంతరాయాలు తప్పవన్నారు. కృత్రిమ మేథస్సు అనే భవిష్యత్తు టెక్నాలజీని అందుకోవడానికి తమ వూహల్లోని కంపెనీని వాస్తవ రూపం ధరింపజేయడానికి అన్వేషణ కొనసాగించామని పేర్కొన్నారు. హిట్ రిఫ్రెష్ చదివిన వారు రోజు వారీ పనిని సృజనాత్మకంగా చేసే సామార్థ్యాన్ని పొందుతాయని సత్యనాదెండ్ల పేర్కొన్నారు.