విజయవాడలో ప్రముఖ పారిశ్రామిక కేంద్రం మరియు ఆటోమొబైల్ హబ్‌గా పేరు గాంచిన ఆటోనగర్ ప్రాంతంలో ఈ రోజు భారీ ప్రమాదం సంభవించింది. కానూరులో ఉదయం ఓ సంస్థలో మంటలు చెలరేగి.. అవి కొద్ది నిముషాల్లోనే పక్కనున్న ఆయిల్ యూనిట్లకు వ్యాపించడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దాదాపు ఓ పదిహేను ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరాయి.
ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఇంకా మంటలు అదుపులోకి రాలేదని వినికిడి. అగ్నిమాపక సిబ్బంది తమ శాయశక్తులా మంటలను అదుపులోకి తీసుకురావడానికి కష్టపడుతున్నారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఎప్పుడైతే ఆటోనగర్ ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించిందన్న సమాచారం అందిందో జాయింట్ పోలీస్ కమిషనర్ క్రాంతి రానా ఘటనా స్థలానికి చేరి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం కానూరు పరిసర ప్రాంతాల్లో ప్రమాద తీవ్రతను అంచనా వేస్తూ... కరెంటు సరఫరా నిలిపివేశారు. అలాగే ప్రస్తుతం ప్రమాద స్థలమంతా ఎక్కువగా పొగ కమ్మేసింది.