Team India leave for Zimbabwe ODI Series: ఐపీఎల్ 2022 అనంతరం భారత క్రికెట్ జట్లు వరుస సిరీస్‌లు ఆడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే వెస్టిండీస్ పర్యటనను ముగించుకున్న టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. భారత్, జింబాబ్వే జట్ల మధ్య ఆగష్టు 18 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఈ వన్డే సిరీస్ కోసం భారత ఆటగాళ్లు శనివారం ఉదయం జింబాబ్వేకు పయనమయ్యారు. ముంబై నుంచి భారత బృదం బయలుదేరింది.
శిఖర్ ధావన్, దీపక్ చహర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్, శార్దుల్ ఠాకూర్ తదితరులు విమానంలో జింబాబ్వేకు బయల్దేరారు. వీరితో పాటు తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం పయనమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఆసియా కప్ 2022 నేపథ్యంలో సీనియర్ ప్లేయర్స్ ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు. హరారే వేదికగా ఆగష్టు 18న మొదటి వన్డే, 20న రెండో వన్డే, 22న మూడో వన్డే మ్యాచ్ జరుగుతుంది.
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌లో భారత జట్టును విజేతగా నిలిపిన ఓపెనర్ శిఖర్ ధావన్‌ను ముణుడిగా జింబాబ్వే టూర్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అయితే గాయం కారణంగా జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ కోలుకోవడంతో.. గబ్బర్ను కెప్టెన్సీ నుంచి తప్పించి అతడికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పారు. మరోవైపు ఈ పర్యటనలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు సైతం విశ్రాంతిని ఇచ్చారు. ద్రవిడ్‌కు బదులు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వెళ్లారు.
Zimbabwe 🇿🇼 bound! ✈️#TeamIndia | #ZIMvIND pic.twitter.com/GKsofzEvRe
— BCCI (@BCCI) August 12, 2022
జట్లు:
భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, దీపక్ చహర్.
జింబాబ్వే: రెగిస్ చకబ్వా (కెప్టెన్), ర్యాన్ బర్ల్, సికందర్ రజా, తనకా చివాండా, బ్రాడ్లీ ఎవన్స్, ఇన్నోసింట్ కైయా, లుకే జాంగ్వే, క్లివ్ మదన్‌డే, వెస్లే మదివేర్, జాన్ మసారా, టోనీ మున్యోంగా, రిచర్డ్, విక్టర్ నగర్వా, విక్టర్ నౌచీ, మిల్టన్ శుంబా, డొనాల్డో తిరిపానో.