తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోకి వచ్చే ఆలయాలను, కట్టడాలను భారత పురాతత్వ శాఖ చేసుకొనే స్వాధీనం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని పలు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే ఇటీవలే టీటీడీ పరిధిలోకి వచ్చే పురాతాన ఆలయాల వివరాలను సాధ్యమైనంత త్వరగా కేంద్ర పురాతత్వ శాఖ వారికి అందివ్వాలని ఆ శాఖ అధికారులు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌కు లేఖ రాశారు.
ఆ లేఖ అనేక అనుమానాలకు తావిస్తోంది. తిరుమల తిరుపతిలో పురాతన భవనాలను తొలిగించి.. కొత్త కట్టడాలను కట్టే అవకాశం ఉందని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని పలువురు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన క్రమంలో.. పురాతత్వ శాఖ టీటీడీ ఈఓకి లేఖ రాసినట్లు సమాచారం. అయితే ఈ లేఖకు ఇప్పటి వరకూ టీటీడీ ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదని తెలుస్తోంది
మరోవైపు, కేంద్ర పురాతత్వ శాఖ అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి వచ్చే ఆలయాలు, కట్టడాలను పరిశీలించేందుకు వస్తున్నారని కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం టీటీడీ ట్రస్టీలు నడుపుతున్న శ్రీవారి దేవస్థానంలోని పురాతన కట్టడాలు పురాతత్వ శాఖ పరిధిలోకి వెళ్లే అవకాశం ఉందా అన్న విషయంపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.