ఓ తండ్రి తాగుడు అలవాటు మాన్పించడం కోసం కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరున్వేలి జిల్లాకి చెందిన దినేష్ అనే 18 సంవత్సరాల కుర్రాడు తల్లి చనిపోవడంతో తన తండ్రి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆ కుర్రాడి తండ్రి మాదాస్వామి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అంతే కాకుండా తాగుడుకి కూడా విపరీతంగా బానిసయ్యాడు. అంతే తండ్రి తాగుడు అలవాటు వల్ల తన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల పాలవుతుందని గ్రహించిన దినేష్ ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు.
తన తండ్రి అలవాటు మానిపించాలంటే తాను చనిపోవడమే పరిష్కారమని భావించి ఉరి వేసుకొని చనిపోయాడు. తన సూసైడ్ నోట్లో దినేష్ అనేక విషయాలను ప్రస్తావించాడు. తమిళనాడు ముఖ్యమంత్రి వెంటనే రాష్ట్రంలోని మద్యం షాపులన్నీ మూసివేయాలని.. లేకపోతే తన ఆత్మ శాంతించదని.. అలాంటి సందర్భంలో తానే వాటిని ధ్వంసం చేస్తానని ఉత్తరంలో పేర్కొన్నాడు
ఆత్మహత్య చేసుకున్నాక దినేష్ బ్యాగ్ వెదికితే అందులో పనిచేయని సెల్ ఫోనుతో పాటు టెన్త్ మార్క్స్ లిస్టు, నీట్ పరీక్ష హాల్ టికెట్ లభించాయి. దినేష్ తమ్ముడు ఏసాకిరాజ్ 8వ తరగతి చదువుతుండగా, చెల్లెలు ధనుశ్రీ 7వ తరగతి చదువుతోంది. దినేష్ కొంతకాలంగా ఇంటికి దూరంగా ఉంటూ మామయ్య వద్ద చదువుకుంటున్నాడు.
తాజా ఘటనలో ఓ విద్యార్థి తన తండ్రికి తాగుడు మాన్పించడం కోసం ఆత్మహత్య చేసుకోవడం అనే విషయం తన మనసు కలచివేసిందని.. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రాష్ట్రంలో పూర్తిస్థాయిలో మద్యపాన నిషేధం చేయాలని పీఎంకే నేత అంబుమణి రాందాస్ డిమాండ్ చేశారు. అయితే తమిళనాడులో ఇప్పటికే 1000 లిక్కర్ షాపులను మూసివేసినట్లు రాష్ట్ర మంత్రి జయకుమార్ తెలిపారు