సీబీఎస్ఈ ఆధ్వర్యంలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ 2018 పేపర్ 1 ఫలితాలను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ ఫలితాలను విద్యార్థులు www.jeemain.nic.in మరియు www.cbseresults.nic.in వెబ్సైట్లలో వీక్షించవచ్చు. ఏప్రిల్ 8, 2018 తేదిన నిర్వహించిన ఈ పరీక్షలకు 10,43,739 విద్యార్థులు హాజరయ్యారు. అందులో 646814 మంది బాలురు పరీక్షలకు హాజరవ్వగా, 266745 బాలికలు, 3 ట్రాన్స్జెండర్లు కూడా ఈ పరీక్షలు రాసారు. ఎన్ఐటీ, ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు.
ఇటీవలే ఈ పరీక్షలను దేశవ్యాప్తంగా 1621 సెంటర్లలో నిర్వహించారు. అలాగే 8 విదేశీ సెంటర్లలో కూడా ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఐఐటి-జేఈఈ పరీక్షలను కేవలం హిందీ, ఆంగ్ల భాషల్లో మాత్రమే నిర్వహిస్తారు. జేఈఈ ప్రశ్నాపత్రాలను 100 మంది నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారుచేస్తారు. వీరందరూ కసరత్తు చేసి 1500 ప్రశ్నలను తయారుచేస్తారు. ఆ 1500 ప్రశ్నలలో 90 ప్రశ్నలను లక్కీ డ్రా ద్వారా తీసి వాటి సహాయంతో 9 సెట్లను తయారుచేస్తారు.