జపాన్ ప్రధానిగా షింజో అబే మళ్ళీ ఎన్నికై ఘన విజయాన్ని సాధించారు. 465 సభ్యులున్న జపాన్ పార్లమెంటులో షింజో అబేకి చెందిన లిబరల్ డెమొక్రటిక్ పార్టీ 312 సీట్లు సాధించి మళ్లీ చరిత్రను తిరగరాసింది.
63 సంవత్సరాల షింజో అబే ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ప్రపంచంలోనే ఎక్కువకాలం పనిచేసిన ప్రధానమంత్రిగా వార్తలలోకెక్కారు. దాదాపు మూడింతల్లో రెండొంతలు సీట్లు సంపాదించిన షింజో అబేకు జపాన్‌లో విమర్శకుల బెడద కూడా ఎక్కువగానే ఉంది.
ప్రస్తుతం మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న షింజో అబే ప్రస్తుతం అణుపరీక్షలకు సంబంధించి చోటుచేసుకుంటున్న వివిధ దేశాల రాజకీయ ప్రమేయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
親愛なる友 @AbeShinzo、総選挙大勝利、心からお祝いを申し上げます。印日関係のさらなる強化のため、共に働き続けることを楽しみにしております。 pic.twitter.com/EWyERlZtvh
— Narendra Modi (@narendramodi) October 23, 2017
ఇదే విషయంపై జపాన్ ప్రభుత్వంతో మాట్లాడడానికి వచ్చే నెల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోతున్న నేపథ్యంలో మళ్లీ షింజో అబే విజయం సాధించడం విశేషం. అణుపరీక్షల విషయంలో ఉత్తరకొరియా అవలంబిస్తున్న తీరును ఇదివరకే అబే తూర్పారపట్టారు.
ప్రస్తుతం ప్రధానిగా గెలిచిన షింజో అబే జపాన్ రాజ్యాంగంలో కూడా సవరణలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అబే పార్టీకి గట్టి పోటి ఇచ్చేందుకు కొద్దిరోజుల క్రితమే ప్రారంభమైన మరో పార్టీ "పార్టీ ఆఫ్ హోప్" ఈ ఎన్నికల్లో కేవలం 49 సీట్లను మాత్రమే గెలుచుకుంది.
ఎన్నికలలో విజయం సాధించిన షింజో అబేకు శుభాకాంక్షలు చెబుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. భారత్, జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు, షింజో అబే విజయం దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ ట్వీట్‌ను మోడీ జపనీస్ భాషలోనే పోస్టు చేయడం విశేషం.