చెన్నయ్: కావేరీ జలాల వివాదంలో ఐపీఎల్ మ్యాచ్‌లను చెన్నైలో నిర్వహించవద్దన్న తమిళ సంఘాల డిమాండ్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. చెన్నై(చెన్నై సూపర్ కింగ్స్)-కోల్‌కతా(కోల్‌కతా నైట్ రైడర్స్)మధ్య చెపాక్ స్టేడియంలో నేడు మ్యాచ్ జరగనుంది. అయితే షెడ్యుల్ ప్రకారం చెన్నైలోనే మ్యాచ్‌లు నిర్వహిస్తామని, వేదికను మార్చబోమని ఐపీఎల్ కమిటీ అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు నల్లటి వస్త్రాలతో మ్యాచ్‌లకు హాజరై తమ నిరసన తెలియజేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు.
అయితే స్టేడియంలో నిరసనలు తెలిపే అవకాశం ఉండటంతో నల్ల దుస్తులు, రిస్ట్ బ్యాండ్స్, బ్యాడ్జెస్‌లతో వచ్చే అభిమానులను లోపలి అనుమతించవద్దని చెప్పినట్లు సమాచారం. అభిమానులు ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని, హెల్మెట్స్, కెమెరాలు, గొడుగులు, బయటి ఫుడ్, మైదానంలోకి విసరడానికి అనువుగా ఉండే ఏ వస్తువును అనుమతించేది లేదని చెన్నై పోలీసులు మీడియాకు తెలిపారు. ప్రయివేట్ సెక్యూరిటీతో పాటు పోలీసులు ఉంటారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తారని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారన్నారు. స్టేడియం వద్ద నిరసనలు జరగకుండా సుమారు రెండు వేల మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.