న్యూఢిల్లీ: ఈ విద్యాసంవత్సరానికి (2018-19) దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యలో దాదాపు 80వేల సీట్లు తగ్గనున్నట్లు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్/ఏఐసీటీఈ) తెలిపింది. ప్రమాణాలకు అనుగుణంగా లేని దాదాపు 200కు పైగా కాలేజీలు మూతపడనుండటంతో ఈ మేరకు సీట్లు తగ్గాయని పేర్కొంది. ఇటు రానున్న నాలుగేళ్లలో 1.31 లక్షల సీట్లు తగ్గనున్నాయన్న ఏఐసీటీఈ.. 2022 నాటికి సాంకేతిక విద్యాసంస్థలన్నీ తమ ప్రోగ్రాంలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్బీఏ) నుంచి అక్రిడేషన్ పొందాలని నిర్ణయించినట్లు తెలిపింది.
దాదాపు ఈ ఏడాది 200 కాలేజీలు విద్యార్థుల ఎన్రోల్మెంట్ లేక క్లోజర్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. కొత్త బ్యాచులకు ఎన్రోల్మెంట్ ఇవ్వకపోయినా పాత బ్యాచుల వరకు మాత్రం ఆ విద్యాసంస్థలు కొనసాగుతాయి. అయితే సాధారణ కాలేజీలతో పోల్చితే.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లో మాత్రం విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఏఐసీటీఈ గణాంకాలు చెబుతున్నాయి.
సీట్లు ఏటా తగ్గుతూ వస్తున్నాయ్..!
2016 నుంచి ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. ఏఐసీటీఈ గణాంకాల ప్రకారం ఏటా సగటున 75 వేల సీట్లకు కోతలు పడుతున్నాయట. 2016-17 విద్యాసంవత్సరంలో 15,71,220 సీట్లకు గానూ కేవలం 7,87,127 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందారు. 2015-16లోనూ ఇదే పరిస్థితి. మొత్తం 16,47,155 సీట్లకు గానూ 8,60,357 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 2016-17 ఏఐసీటీఈ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 3,415 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ఆ ఏడాది దాదాపు 50 కాలేజీలదాకా మూతపడ్డాయి.