ఏపీ ఐటిశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్రంలోని ఇతర ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసిరారు. ఫ్లైట్ టికెట్లు తానే బుక్ చేస్తానని.. వీలైతే రాష్ట్రానికి వారు కొత్త కంపెనీలు తీసుకురావాలని.. అలా వారు ఐటి కంపెనీలను తీసుకొస్తే.. తమ ప్రభుత్వం 21 రోజుల్లో అనుమతులు జారీ చేస్తుందని తెలిపారు. అలాగే విశాఖలో ప్రారంభమవ్వబోయే ఐటి కంపెనీల విషయంలో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు లేవనెత్తిన అభ్యంతరాలపై కూడా నారా లోకేష్ స్పందించారు. కంపెనీలకు ఇచ్చే భూములను, అన్ని నిబంధలనకు లోబడే ఇస్తున్నామని ఆయన అన్నారు.
నారా లోకేష్ మంత్రి పదవి చేపట్టాక ఎన్ని ఐటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చాయని ప్రతిపక్షాలు సంధించిన ప్రశ్నకు జవాబిస్తూ.. ఆయన సెటైర్ వేశారు. ప్రతిపక్షాలు కూడా ఐటి కంపెనీలు తీసుకొస్తామంటే.. తానే వారికి ఫ్లైట్ టికెట్లు కొని విదేశాలకు పంపిస్తానని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రానికి ఎన్నో ఐటి కంపెనీలు వచ్చాయని.. అసెంబ్లీకి వచ్చే సభ్యులు, రాని సభ్యులకు కూడా పూర్తిగా వివరాలు తెలిపేందుకే తాను ఐటి కంపెనీలకు సంబంధించిన విషయాలు చెబుతున్నానని ఆయన అన్నారు.
ప్రతిపక్షాలకు నారా లోకేష్ సవాల్...!