Pegasus in Ap Assembly: ఇండియాతో పాటు ప్రపంచదేశాల్ని కుదిపేసిన పెగసస్ స్పైవేర్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది. దీదీ వ్యాఖ్యలు రేపిన దుమారం ప్రతిపక్షం తెలుగుదేశాన్ని ఇరుకునపెడుతోంది.
ఎక్కడో ఇజ్రాయిల్‌లో ఓ కంపెనీ నిఘా సాఫ్ట్‌వేర్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణలు. ఈ రెంటి ప్రభావం ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంను ఇరుకునపెడుతోంది. ఇండియాతో పాటు ప్రపంచదేశాల్ని కుదిపేసిన పెగసస్ స్పైవేర్ వ్యవహారం గత కొద్దికాలంగా సద్దుమణిగినా..పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి దీదీ వ్యాఖ్యలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. దీదీ వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి.
పెగసస్ స్పైవేర్‌ను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కొనుగోలు చేసిందనేది తాజాగా మమతా బెనర్జీ చేసిన ఆరోపణ. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా ఇంటెలిజెన్స్ ఐజీ ఏబీ వెంకటేశ్వరరావుపై రక్షణకు సంబంధించిన వ్యవహారాల్లో ఇజ్రాయిల్ కంపెనీతో లోపభూయిష్టమైన కొనుగోళ్లు జరిపిందనే అభియోగాలతో ఆయన సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు మమతా వ్యాఖ్యలతో అధికార పార్టీ వాదనకు బలం చేకూరుతోంది. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని ఇరుకునపెట్టేందుకు వ్యూహం రచించింది.
పెగసస్ స్పైవేర్ ఉపయోగించడం ద్వారా నాడు ప్రతిపక్షంలో ఉన్న తమ ఫోన్లను టీడీపీ ప్రభుత్వం ట్యాప్ చేసిందని..ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు అబ్బయ్య చౌదరి, గుడివాడ అమర్‌నాధ్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు కుట్రను బయటపెట్టిన మమతా బెనర్జీపై పరువు నష్టం దావా వేస్తామని చంద్రబాబు అండ్ కో ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. దీదీ చెప్పిన విషయాలు నూటికి నూరుపాళ్లు నిజం కాబట్టే..చంద్రబాబు సమాధానం చెప్పలేకపోతున్నారని వైసీపీ నేతలు విమర్శలు అందుకున్నారు.
అసెంబ్లీ వేదికగా టీడీపీను ఇరుకునపెట్టే వ్యూహం
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశంపై తెలుగుదేశం పార్టీని ఇరుకునపెట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచించింది. పెగాసస్‌పై చర్చకు డిమాండ్ చేసింది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్డీ వ్యాఖ్యల్ని అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తావించగా..ప్రభుత్వ ఛీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి చర్చకు నోటీసిచ్చారు. అటు ఈ వ్యవహారంపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారామ్ తెలిపారు. అందుకు తగ్గట్టుగానే అసెంబ్లీలో చర్చ ప్రారంభమైంది. పెగసస్ స్పైవేర్ అంశాన్ని సుప్రీంకోర్టు కూడా సీరియస్‌గా తీసుకున్న విషయాన్ని మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు. పెగసస్ ద్వారా నాటి ప్రభుత్వం ఫోన్లు ట్యాపింగ్ చేసిందన్నారు.
ఇటు ఇదే అంశంపై మరో మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా అసెంబ్లీలో మాట్లాడారు. పెగసస్ కొనుగోలు చేయాలంటూ తమ వద్దకు కొంతమంది వచ్చినట్టుగా అప్పటి ఐటీ మంత్రి లోకేష్ స్వయంగా చెప్పారన్నారు. పెగసస్ స్పైవేర్‌ను ఎవరు కొన్నారు, ఎలా ఉపయోగించారో తేలాలని చెప్పారు. మొత్తానికి పశ్చిమ బెంగాల్‌లో మమతా కదిపిన తేనెతుట్టె..టీడీపీని వెంటాడుతోంది.
Also read: AP Politics: ప్రభుత్వ వ్యతిరేక ఓటు సంఘటితమయ్యేనా, మారుతున్న రాజకీయ పరిణామాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Pegasus in Ap Assembly: అసెంబ్లీలో పెగసస్ అంశంపై చర్చ, టీడీపీని ఇరుకునపెట్టే వ్యూహం