తన వ్యాఖ్యల్ని కొన్ని పత్రికలు వక్రీకరించాయన్న పవన్ కల్యాణ్

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తన వ్యాఖ్యలను కొన్ని పత్రికలు వక్రీకరించాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ ద్వారా స్పష్టం చేశారు. 

Last Updated : Mar 21, 2018, 12:30 PM IST
తన వ్యాఖ్యల్ని కొన్ని పత్రికలు వక్రీకరించాయన్న పవన్ కల్యాణ్

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తన వ్యాఖ్యలను కొన్ని పత్రికలు వక్రీకరించాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ ద్వారా స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అంశంపై పవన్ కల్యాణ్ యు టర్న్ తీసుకున్నారని మంగళవారం చెలరేగిన రాజకీయ దుమారంపై ట్విట్వర్ ద్వారా స్పందిస్తూ పవన్ కల్యాణ్ ఓ ట్వీట్ చేశారు. చట్ట ప్రకారం రావలసి వున్న నిధులు, ఎక్సైజ్ సుంకం రాష్ట్రానికి రానప్పుడు స్పెషల్ స్టేటస్‌తో ప్రయోజనం ఏంటని మాత్రమే తాను అభిప్రాయపడ్డాను కానీ తనకు మరో ఉద్దేశం లేదని పవన్ ఈ ట్వీట్ ద్వారా తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నిధులతోపాటు ప్రత్యేక హోదా కూడా కావాలనేదే జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది అని పవన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కి తక్షణ సహాయం కావాలని, అది ప్రత్యేక హోదానా? ప్రత్యేక ప్యాకేజీనా? అనేది అంత ముఖ్యం కాదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించినట్టుగా ఓ మీడియా సంస్థ పేర్కొనడంతో ఈ వివాదం చెలరేగింది. ప్రత్యేక హోదా సాధన కోసం అవసరమైతే ఆమరణ నిరాహర దీక్షకైనా సిద్ధం అని గుంటూరు సభలో ప్రకటించిన పవన్ కల్యాణ్.. అప్పుడే ప్రత్యేక హోదా అంశంపై ఎలా యూ టర్న్ తీసుకున్నాడంటూ పలువురు ఆయనపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ ట్విటర్ ద్వారా ఈ వివరణ ఇచ్చుకున్నారు. అయితే, అంతకన్నా ముందుగా ఈ వివాదంపై  జనసేన పార్టీ సైతం తమ అధికారిక ట్విట్టర్‌‌ ఖాతా ఓ ప్రకటన చేసింది. పవన్ కల్యాణ్ అభిప్రాయాలను రిపోర్టర్ తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ పొరపాటు జరిగింది అని జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం ఆ ట్వీట్‌లో తెలిపింది.

 

Trending News