12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారం చేసిన నిందితులకు మరణ శిక్ష విధించే విధంగా రూపొందించిన బిల్లును రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. క్రిమినల్ చట్టాలు 2018 బిల్లుకు పలు సవరణలు చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం మంగళవారం ఓ బిల్లుని శాసనసభలో ప్రవేశపెట్టగా.. శుక్రవారం సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు మరణశిక్ష విధించాలనే చట్టాన్ని ఆమోదించిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వంగా ఇప్పటివరకు మధ్యప్రదేశ్ గుర్తింపు పొందగా తాజాగా ఆమోదించిన బిల్లుతో రాజస్థాన్ సైతం మధ్యప్రదేశ్ సరసన చేరినట్టయింది.
బాలికలపై తరచుగా చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనలు రాజస్థాన్ సర్కార్ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ నేరాలకు చరమగీతం పాడాలంటే, చట్టాలను మరింత కఠినతరం చేయాలి అనే ఉద్దేశంతోనే పాత చట్టానికి పలు సవరణలు చేసినట్టు ఈ సందర్భంగా రాజస్థాన్ ప్రభుత్వం అభిప్రాయపడింది. బాలికల వికాసానికి ఈ చర్య ఎంతో దోహదపడుతుందని రాజస్థాన్ సర్కార్ ఆశాభావం వ్యక్తంచేసింది.