11 COVID patients dead in Tirupati's Ruia Hospital tragedy: తిరుపతి: తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. రుయా ఆస్పత్రిలో ఆక్సీజన్ అందక 11 మంది కరోనా పేషెంట్స్ మృతి చెందారు. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం... ఆక్సీజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో దాదాపు 45 నిమిషాల పాటు ఆక్సీజన్ అవసరమైన కరోనా పేషెంట్స్ ప్రాణవాయువు లేకుండానే గడపాల్సి వచ్చిందని, ఈ కారణంగానే 11 మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.
తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ :
తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయా కుటుంబాలకు సీఎం జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అందించిన వివరాలను సీఎంవో అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించి తనకు నివేదిక అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీచేశారు.
Andhra Pradesh: 11 patients died in Ruia Govt Hospital Tirupati due to a reduction in pressure of oxygen supply, says Chittoor District Collector Harinarayan. Chief Minister YS Jagan Mohan Reddy has ordered an inquiry into the matter. pic.twitter.com/eWY46QEizt
— ANI (@ANI) May 10, 2021
రుయా ఆస్పత్రి (RUIA hospital) ఘటనకు దారితీసిన పరిస్థితులు, కారణాలను గుర్తించి, మళ్లీ అలాంటి ఘటనలు రాష్ట్రంలోనే ఇంకెక్కడా పునరావృతం కాకుండా యుద్ద ప్రాతిపదికిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్-19 చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టంచేశారు. ఆక్సిజన్ సేకరణ, సరఫరాలపైనే కాకుండా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ వ్యవస్థల నిర్వహణ ఏ విధంగా ఉందో తనిఖీలు చేసి లోపాలు ఉన్న చోట లోపాలు సరిదిద్దాలని అధికారులకు సూచించారు.
రుయా ఆసుపత్రి ఘటనలో (RUIA hospital tragedy) అధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 11 మంది అని తెలుస్తుండగా.. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం ఆ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా పూర్తి సమాచారం రావాల్సి ఉంది.