పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నో అరాచకాలకు పాల్పడిందని ఎంతో ఉద్వేగంగా ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే, అదే ప్రధాని మోడీ రాజ్యసభలో తన ప్రసంగానికి అడ్డురాబోయిన కాంగ్రెస్ నేతలపై మాత్రం వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ కనిపించారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం కాంగ్రెస్‌తో ఇక దేశానికి పనిలేదని స్వయంగా మహాత్మాగాంధీయే చెప్పారని, అటువంటప్పుడు కాంగ్రెస్ లేని భారత్ నినాదం మహాత్మాగాంధీదే అవుతుంది కానీ తనది ఎలా అవుతుందని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ సభ్యులని ఉద్దేశించి ప్రశ్నించారు.
అయితే, ప్రధాని మోడీ వ్యాఖ్యలకు తీవ్ర అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్ నేతలు ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. దీంతో మొదట ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఒక్క నిమిషం వేచి వుండాల్సిందిగా విజ్ఞప్తి చేసిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు.. అదే సమయంలో కాంగ్రెస్ నేతలని వారించారు. ఓవైపు తాను చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ నేతలు పట్టించుకోకపోవడంతో ఒకింత అసహనానికి గురైన వెంకయ్య నాయుడు.. మీకు ఏమైనా సమస్య ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లాలి కాని ఇక్కడ సీన్ క్రియేట్ చేయొద్దంటూ ఎంపీ రేణుకా చౌదరికి తనదైన స్టైల్లో చురకలు అంటించారు.
ఇదిలావుండగానే ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అడ్డుపడుతూ రేణుకా చౌదరి పెద్దగా నవ్వడంపై ప్రధాని స్పందిస్తూ "అప్పట్లో రామాయణం సీరియల్‌లో అలాంటి నవ్వులు వినేవాళ్లం. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే వింటున్నాం" అంటూ ఆమెపై సెటైర్ వేశారు. ప్రదాని మోదీ చమత్కారంపై బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తూ ఘొల్లుమన్నారు.
రేణుకా చౌదరిపై సెటైర్ వేసిన ప్రధాని