తప్పుడు చిరునామాలతో వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్రభుత్వానికి సుమారు రూ.20 లక్షల పన్ను ఎగ్గొట్టిన కేసులో ప్రముఖ సినీ నటి అమలా పాల్ని ఆదివారం అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు ఆమెని కోర్టులో హాజరుపర్చినట్టు తెలుస్తోంది. అనంతరం షరతులతో కూడిన బెయిల్‌పై అమలాపాల్‌ని విడుదల చేసిన కోర్టు.. ఈ కేసు విచారణలో పోలీసులకు సహకరించాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం.
అమలాపాల్ తరహాలోనే తప్పుడు చిరునామాలతో వాహనాల రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించాల్సిన మొత్తాన్ని ఎగ్గొట్టారని పేర్కొంటూ మళయాళం యువ నటుడు ఫహద్ ఫాసిల్, సినీనటుడు, బీజేపీ ఎంపీ సురేష్ గోపీలపై కూడా కేరళ పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. పుదుచ్చేరిలో ఉంటున్నట్టుగా తప్పుడు చిరునామాలు చూపించి అక్కడ తమ ఖరీదైన వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా ఒక్కొక్కరు ప్రభుత్వానికి రూ.20 లక్షల మేర పన్ను ఎగ్గొట్టారనే అభియోగాలు కింద కేరళ పోలీసులు ఈ ముగ్గురు సినీప్రముఖులపై విచారణ జరుపుతున్నారు.
ఇక అమలాపాల్ సినిమా కెరీర్ విషయానికొస్తే, అరవింద్ స్వామితో కలిసి చేసిన 'భాస్కర్ ఓరు రాస్కల్' సినిమా త్వరలోనే రిలీజ్ కానుండగా విష్ణు విశాల్‌తో కలిసి చేస్తోన్న రచ్చసన్ సినిమా ప్రస్తుతం ప్రొడక్షన్ స్టేజ్‌లో వుంది.