Mohammad siraj: ఇండియా ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ టెస్ట్ నాలుగవరోజు జరిగిన అద్భుతం అంత త్వరగా మర్చిపోలేం. టీమ్ ఇండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ 5 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఈ టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో 6 వికెట్లు తీశాడు. హర్షా భోగ్లే, వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజ క్రికెటర్లు ట్వీట్ల ద్వారా ప్రశంసల వర్షం కురిపించారు సిరాజ్‌పై..ఎవరేమన్నారో చూద్దాం..
ఈ టూర్‌కు ఓ బాలుడు వచ్చాడు. ఇప్పుడు మనిషిగా మారాడు. తొలి టెస్ట్ సిరీస్‌లోనే తన అద్భుత బౌలింగ్ అటాక్ లీడర్‌గా మారిపోయాడు. టీమ్ ఇండియా ఆటగాళ్లు ఈ టూర్‌లో చూపించిన ప్రతిభ ఎప్పటికీ గుర్తుండిపోతుందని టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసించాడు.
తండ్రిని కోల్పోయిన తరువాత ఆస్ట్రేలియాలో ఉండటమనేది సాధారణ విషయం కాదు. కానీ ఆట పట్ల మీకున్న నిబద్ధత, కసి కచ్చితంగా మీ తండ్రికి గర్వకారణమని నేను అనుకుంటున్నాను. ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసినందుకు మీకు ముబారకాబాద్..ఇక ముందు కూడా ఇదే ప్రదర్శన కొనసాగుతుందని ఆశిస్తున్నానంటూ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో కష్టపడటం చాలా ముఖ్యం. సిరాజ్ మరియు శార్దుల్ ప్రదర్శనలో అది కన్పించింది. ప్రతి స్పెల్‌లో అద్భుతం చేయడం అంత సులభమమైన విషయం కాదు. అది మీరు చేసి చూపించారు అంటూ టీమ్ ఇండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసించాడు.
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ట్వీట్ ద్వారా సిరాజ్ బౌలింగ్‌ను కీర్తించాడు. తన తండ్రిని పోగొట్టుకున్నా..ఆస్ట్రేలియాలో ఉండాలనుకున్నాడు. ఇతనిపై జాత్యాహంకార దాడి జరిగింది. అయినా ఆ ప్రభావం తనపై పడనివ్వలేదు. ఒక్క ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సాధించాడు. కచ్చితంగా అభిమానం, ప్రేమ, గౌరవానికి పాత్రుడివి..అంటూ ట్వీట్ చేశాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ ద్వారా సిరాజ్‌పై ప్రశంసలు కురిపించాడు. మీరు తొలిసారి ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి అద్భుతం చేశారు. శార్దుల్ ఠాకూర్ అయితే ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అంటూ ట్వీట్ చేశాడు సచిన్..
సూపర్ మొహమ్మద్ సిరాజ్..సూపర్..ఈ టూర్‌లో మీరు సాధించిన ప్రగతి మనస్సును హత్తుకుంటోంది. సుదీర్ఘకాలం మీ కెరీర్ కొనసాగాలని ఆశిస్తున్నాను..అంటూ ప్రఖ్యాత కామెంటేటర్ హర్షా బోగ్లే ట్వీట్ చేశాడు.