నివర్ సైక్లోన్ ప్రభావం నుంచి ఇంకా తేరుకోలేదు. భారీ వర్షాల ముంపు ఇంకా తొలగనే లేదు. మరో మూడ్రోజులపాటు అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
బంగాళాఖాతం ( Bay of Bengal )లో ఏర్పడిన నివర్ తుపాను ( Nivar Cyclone ) నవంబర్ 25 రాత్రి తమిళనాడు కరైకల్ సమీపంలో తీరం దాటింది. నివర్ సైక్లోన్ ప్రభావంతో తమిళనాడుతో పాటు ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇతర ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పంట చేతికొచ్చే సమయంలో పడిన వర్షాలు కావడంతో రైతాంగం ఇబ్బంది ఎదుర్కొంది. నివర్ సైక్లోన్ ముప్పు నుంచి కోలుకోకముందే మరో రెండు తుపాన్లు పొంచి ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ ( IMD ) సూచించింది. డిసెంబర్ 2, 6 తేదీల్లో రెండు తుపాన్లు బంగాళాఖాతంలో ఏర్పడనున్నాయని తెలిపింది.
ఈ నేపధ్యంలో ఇప్పటికే ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ( Low Depression ) ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రానున్న 48 గంటల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. డిసెంబర్ 2వ తేదీన దక్షిణ తమిళనాడు-పాండిచ్చేరి మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న 3 రోజుల పాటు దక్షిణ కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు ( Heavy rains ) పడవచ్చనే హెచ్చరికల నేపధ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కంట్రోల్ రూంలు, పునరావాస కేంద్రాల్ని కొనసాగించనున్నారు. Also read: AP: రాజధాని మార్చే అధికారం శాసనసభకు ఎందుకుండదు ?