ఆస్ట్రేలియా పర్యటనను ఓటమితో ఆరంభించిన టీమిండియాకు షాక్ తగిలింది. భారత క్రికెటర్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. ఈ నిర్ణయాన్ని ఐసీసీ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ తీసుకున్నారు. సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు బౌలింగ్ పరిమితికి మించిన సమయాన్ని తీసుకోవడంతో టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధించారు. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటనలో విషయాన్ని తెలిపింది.
ఐసీసీ రూల్స్ ప్రకారం 210 నిమిషాలు (మూడున్నర గంటల్లో) వన్డే మ్యాచ్‌లో 50 ఓవర్ల కోటా పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత బౌలర్లు ఇంతకుమించిన సమయాన్ని బౌలింగ్ కోసం తీసుకున్నారు. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత ఒక ఓవర్ వేసినట్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం అంగీకరించాడు. దీంతో జరిమాను జట్టు అంగీకరించినట్లయింది.
ఐసీసీ ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం స్లో ఓవర్ రేట్ ఓవర్లను పరిశీలించిన అనంతరం భారత క్రికెటర్లకు 20 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించారు. మరోవైపు జరిమానాతో పాటు భారత జట్టు ఒక ఛాంపియన్‌షిప్‌ను కోల్పోనుంది. జరిమానా విషయాన్ని ఐసీసీ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
కాగా, శుక్రవారం నాడు సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 66 పరుగుల తేడాతో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. తొలుత ఆసీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 374 పరుగులు చేయగా.. టీమిండియా నిర్ణీత ఓవర్లాడి 8 వికెట్ల నష్టానికి 308 పరుగులకు పరిమితమై ఓటమి పాలైంది.
India vs Australia: భారత క్రికెటర్లకు జరిమానా విధించిన ఐసీసీ