బిట్ కాయిన్ పై వస్తున్న అనేకరకాల ఊహాగానాలకు తెరదించారు కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ. బిట్ కాయిన్ కు భారతదేశంలో చట్టబద్దత లేదని మరోమారు స్పష్టం చేశారు.
"డిసెంబర్ 24, 2013 నుండి, ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) బిట్ కాయిన్, ఇతర రూపాల్లో ఉన్న వాస్తవిక కరెన్సీ(వర్చువల్ కరెన్సీ)పై ఒకే వైఖరితో ఉంది. ఇప్పటికీ అదే స్థితిని కొనసాగిస్తున్నాం. బిట్ కాయిన్ మరియు ఇతర వర్చువల్ కరెన్సీకి భారతదేశంలో న్యాయబద్ధత, చట్టబద్దత లేదు" అని రాజ్యసభలో అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చారు.
"బిట్ కాయిన్ సమస్య భారత దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 785 వర్చువల్ కరెన్సీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అన్ని లావాదేవీలు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. భారతదేశంలో 11 వర్చువల్ కరెన్సీలతో జరిగే లావాదేవీలను మేము గుర్తించాం. మరిన్ని వివరాలు నిపుణుల నుండి రావాల్సి ఉంది" అన్నారు.
బిట్ కాయిన్ అంటే?
బిట్ కాయిన్ ఒక డిజిటల్ కరెన్సీ. దీనికి రూపం ఉండదు. మధ్యవర్తులు ఉండరు. దీనిని ఆన్లైన్ లోనే కొనగలం,, అక్కడే అమ్మగలం. దీన్ని ఎవరూ ముద్రించరు. ఇది ఏదేశ నియంత్రణలోకి రాదు. శక్తివంతమైన సర్వర్లు, నెట్ వర్క్ లను ఉపయోగించి ఆన్లైన్ లో బిట్ కాయిన్ సృష్టిస్తారు.