జనసేన వ్యవస్థాపకులు పవన్ కల్యాణ్ కొద్ది రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజాయాత్రను ప్రారంభిస్తారని ఆ పార్టీ మీడియా వ్యవహారాల ఇన్ఛార్జి హరిప్రసాద్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇక వీలున్నప్పుడల్లా ప్రజానీకంతో మమేకమవుతూ.. వారి మధ్యకు వచ్చి వారి సమస్యలను తెలుసుకుంటారని ఆయన తెలియజేశారు. 2014లో అప్పటి రాజకీయ కారణాల మేరకు, ప్రజల పరిస్థితి మేరకు, జనసేన పార్టీ తెదేపా - భాజాపా కూటమికి మద్దతిచ్చిందని... కానీ నేటి పరిస్థితులు వేరని.. తాము ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నది సమయమే నిర్ణయిస్తుందని చెప్పారు. ప్రజానీక సమస్యలపై పోరాటం చేసే పార్టీలన్నీ తమకు మిత్రపక్షాలేనని పేర్కొన్నారు.
త్వరలో ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకోవడానికి.. వాటిని పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ తప్పకుండా ప్రజల మధ్యకు వస్తారని. అయితే యాత్ర ఏ రూపంలో ఉంటుందో కచ్చితంగా చెప్పలేమన్నారు. ప్రజానీక సమస్యలను పోరాటం చేసి పరిష్కరించడమే జనసేన ప్రధాన అజెండా అని... ఏపీ ప్రత్యేక హోదాపై ఏ పార్టీతోనైనా కలిసి పోరాడటానికి జనసేన సంసిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. 2019 ఎన్నికల్లో 60 శాతం సీట్లు జనసేన వాలంటీర్లకేనని ఆయన వెల్లడించారు.