న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నసందర్భంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులను, పేదలను ఆదుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సూచించారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేద కుటుంబాలకు అండగా ఉండాలని, వారికి నగదు బదిలీ సక్రమంగా అందేలా చూడాలని అన్నారు. లాక్డౌన్తో రోజువారీ వేతన కార్మికుల జీవితం అస్తవ్యస్తమైపోయిందని ఆకలి బాధలు పడుతున్నారని తక్షణమే వారిని ఆదుకోవాలన్నారు.
మరోవైపు నేడు ప్రధాని, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానంగా కరోనా వైరస్ కట్టడికి, వైరస్ వ్యాప్తి నివారణకు గల చర్యలపై రాష్ట్రాల్లో పరిస్థితులపై ప్రధాని సమీక్ష నిర్వహించారు. లాక్ డౌన్ కొనసాగించే విషయంపై సీఎంల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కాగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల సీఎంలు లాక్ డౌన్ ను పొడిగించాలని ప్రధానిని కోరిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా లాక్ డౌన్ ఎత్తివేసే సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై, ఎత్తివేస్తే కొత్త సమస్యలు రాకుండా చూడాల్సిన అవసరం ఉందని లాక్ డౌన్ కొనసాగింపుతోపాటు వైరస్ ను ఎదుర్కోవడానికి, కార్మికుల , పేదల జీవనంపై తీసుకోవాల్సిన చర్యలపై కూడా కీలకంగా చర్చించారు. కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని అన్నారు. కాగా ముఖ్యమంత్రులతో సమీక్ష అనంతరం లాక్డౌన్ కొనసాగింపుపై జాతినుద్దేశించి ప్రసంగిస్తారని ప్రధాని కార్యాలయ వర్గాలు తెలిపాయి.