Importance Of Ratham Muggu: సంక్రాంతి సంబరాల ముగింపు రోజైన కనుమ నాడు తెలుగు సంప్రదాయాలలో రథం ముగ్గు వేయడం చాలా ప్రత్యేకమైన ఆచారం. ఈ ముగ్గు వేయడం వెనుక లోతైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక అర్థాలు దాగి ఉన్నాయి. రథం ముగ్గును సూర్య భగవానుడి రథంగా భావిస్తారు. సూర్యుడు అన్ని ప్రాణులకు జీవనాధారం. అందుకే ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఈ ముగ్గును వేస్తారు. పురాణాల ప్రకారం మనవుడు అనే రాజు తన దేహాన్ని ఒక రథంగా భావించి దాన్ని పరమాత్ముడు నడిపిస్తున్నాడని నమ్మేవాడు. రథం ముగ్గు ద్వారా మనం కూడా మన దేహాన్ని ఒక రథంగా భావించి దాన్ని పరమాత్ముడు సరైన మార్గంలో నడిపించాలని ప్రార్థిస్తామని పురాణాలు చెబుతున్నాయి.
రథం ముగ్గును వీధిలోని ఇళ్లన్నీ కలిసి వేయడం వల్ల సమాజంలోని ప్రతి ఒక్కరూ ఒకరితో ఒకరు కలిసి ఉండాలనే సందేశాన్ని ఇస్తుంది. రథం ముగ్గు వేయడం వల్ల శ్రేయస్సు, సుఖశాంతి, ఆయురారోగ్యాలు లభిస్తాయని నమ్మకం.
కొన్ని ప్రాంతాలలో రథం ముగ్గును పూర్వీకుల ఆత్మలను ప్రసన్నం చేసుకోవడానికి కూడా వేస్తారని నమ్మకం. ఆధ్యాత్మికత ప్రకారం రథం ముగ్గును శ్రీకృష్ణుడి రథానికి ప్రతీకగా భావిస్తారు. ఇది శ్రీకృష్ణుడిని ఆహ్వానించి, ఆయన ఆశీర్వాదాలను పొందాలనే కోరికను సూచిస్తుంది.
గృహప్రవేశం సందర్భంగా కూడా రథం ముగ్గు వేయడం ఆనవాయితీ. ఇది కొత్త ఇంటికి శుభాన్ని తెస్తుందని నమ్ముతారు. రథం ముగ్గులు వివిధ రకాల డిజైన్లు, రంగులతో వేస్తారు. ఇవి చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి, కళాత్మక నైపుణ్యాలను ప్రదర్శిస్తాయి.
రథం ముగ్గుపైన సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా కొన్ని కథలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి ఒక రాజు తన కుమారుడిని కోల్పోతాడు. తన కుమారుడిని బతికించాలని, తన వారసత్వాన్ని, తన వంశాన్ని ఆగిపోకుండా చూడాలని ఆ రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థస్తాడు.
తన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై బియ్యపు పిండితో నేలపై తన కుమారిడి గీయాలని చెబుతాడు. రాజు ఆ ప్రకారం చేయగా అతని కుమారుడు బతికిపోతాడు.
దీంతో ఈ రథం ముగ్గును జీవితం, అదృష్టం , శ్రేయస్సుకు ప్రతీకగా భావించి ఆనవాయితీగా వేస్తూ ఉంటారని పెద్దలు చెబుతుంటారు. మరొక కథ ప్రకారం ముగ్గులు నక్షత్ర మండలాలకు ప్రతిరూపాలు. అంతేకాదు ప్రకృతిలోని జీవుల పట్ల భూతదయతో ఉండమని చెప్పడమే ముగ్గుల అంతరార్ధం.
రథం ముగ్గు అనేది కేవలం ఒక కళాత్మక అభివ్యక్తి మాత్రమే కాదు ఇది మన ఆధ్యాత్మిక జీవితంతో అనుబంధాన్ని కలిగి ఉంది. ఇది మనం మన జీవితాలలో ఆధ్యాత్మికతను ప్రవేశపెట్టే ఒక అద్భుతమైన మార్గం.
ఈ ముగ్గును ఇంటి ముందు వేస్తే అనేక మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలస్యం చేయకుండా మీరు వేయండి.