న్యూజిలాండ్‌తో ఆదివానం జరిగిన చివరి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(60 రిటైర్డ్‌హర్ట్) హాఫ్ సెంచరీ, కేఎల్ రాహుల్(45), శ్రేయస్ అయ్యర్(33 నాటౌట్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మ్యాచ్ ఓడినా ఓ ఓవర్ మాత్రం పండుగ చేసుకుంది.
భారత ఆల్ రౌండర్ శివం దుబే వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో ఏకంగా 34 పరుగులను కివీస్ పిండుకుంది. తొలి రెండు బంతులు సిక్సర్లు, కాగా మూడో బంతికి ఫోర్, నాలుగో బంతికి సింగిల్, ఆపై నో బాల్ ఫోర్, చివరి రెండు బంతులను సైతం కివీస్ బ్యాట్స్ మెన్ రాస్ టేలర్, టిమ్ సీఫెర్ట్ సిక్సర్లు బాదడంతో ఏకంగా 34 పరుగులు సమర్పించుకున్నాడు దుబే. చివరికి ఎలాగోలా భారత్ గట్టెక్కింది. కానీ టీ20 చరిత్రలో అత్యంత ఎక్కువ పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా శివం దుబే నిలిచాడు. స్టూవర్ట్ బ్రాడ్ ఓ టీ20 ఓవర్లో 36 పరుగులు సమర్పించుకున్న విషయం తెలిసిందే. చివరి టీ20 నెగ్గిన భారత్ 5-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
మ్యాచ్ ముగిసిన తర్వాత దుబేపై సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. శివం దుబే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీలా బౌలింగ్ చేస్తాడని, జస్ప్రిత్ బుమ్రాలాగ బ్యాటింగ్ చేస్తాడంటూ నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు. దుబే లాంటి ఆటగాడిని ఇప్పట్లో వెతకలేమంటూ కొందరు ట్వీట్లు చేశారు. భారత జట్టుకు శివం దుబే ఏ సేవలు అందించాడో ఎవరైనా చెబుతారా అంటూ మరో నెటిజన్ చురకలంటించాడు.
కోహ్లీ+బుమ్రా = శివం దుబే.. నెటిజన్లా మజాకానా!