నల్గొండ: తెలంగాణ మున్సిపల్‌శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నాడని కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. మద్యం డబ్బులు, ఎంఐఎం ద్వారానే మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తామని టీఆర్ఎస్ ధైర్యంగా ఉందన్నారు. కల్వకుంట్ల ఒవైసీ కుటుంబ కబంధ హస్తాల నుంచి తెలంగాణ ప్రజలు విముక్తిని కోరుకుంటున్నారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ పాత పట్టణం, చౌటుప్పల్, తంగడిపల్లిలో కేంద్ర మంత్రి బీజేపీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి భారీగా బైకులతో పార్టీ నేతలు స్వాగతం పలికారు.
Also Read: ఆ టీఆర్ఎస్ నేతలను పీకిపారేస్తా: కేటీఆర్
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నల్గొండకు బీజేపీకి అవినాభావ సంబంధం ఉంది. నల్గొండను ఏం అభివృద్ధి చేశారో చెప్పి, టీఆర్ఎస్ నేతలు ఓట్లు అడగాలి. అధికార దుర్వినియోగం, విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ టీఆర్ఎస్ ఎన్నికల బరిలో దిగింది. గత రెండు దశాబ్దాలుగా నల్గొండ పట్టణంలో ఏ సమస్య వచ్చినా బీజేపీ నిలబడింది. మా వద్ద నిధులు లేకున్నా.. సేవ చేసే గుణం ఉంది. కానీ టీఆర్ఎస్ మాత్రం ప్రజల వద్ద దోచుకున్న డబ్బులనే ఓటర్లకు పంచుతుందని’ కిషన్ రెడ్డి ఆరోపించారు.
సెక్రటరీ లేని రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ అన్నారు. తెలంగాణలో ఒక్క గ్రామానికి కూడా మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం ఏ మొహం పెట్టుకుని టీఆర్ఎస్ నేతలను ఓట్లు అడిగేందుకు పంపుతుందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ సొంతూరు చింతమడకలో తప్ప.. రాష్ట్రంలో మరెక్కడైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి పేదలకు ఇచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. 2023లో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి భారీ విజయం అందించాలని ప్రజలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. కాగా, ఈ నెల 22న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..