అమరావతి: టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ త్వరలోనే వైసీపీలో చేరతానని, సీఎం వైఎస్ జగన్‌తో కలిసి పనిచేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీ మార్పు విషయంలో సాంకేతికంగా ఏ సమస్య తలెత్తినా.. అది తాను, చంద్రబాబు నాయుడు చూసుకుంటామని వంశీ స్పష్టంచేశారు. అయితే, టీడీపీ నుంచి గెలిచి వంశీ వైసిపిలో చేరడంపై టీడీపీ నుంచి సమస్యలు ఎదుర్కోవడం సంగతి అటుంచితే.. ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు వైసిపి సిద్దంగా లేదనే విషయాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తేల్చిచెప్పారు.
Also read : జగన్‌కి మద్దతిస్తే నాకేం ప్రయోజనం లేదు, కేసులు నాకు కొత్త కాదు: వల్లభనేని వంశీ
ఏ సభుడైనా పార్టీ మారాలనికుంటే తప్పనిసరిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనని.. రాజీనామా చేయకుండా పార్టీ మారితే చర్యలు తప్పవని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టంచేశారు. సభా నాయకుడిగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఇదే విషయం చెప్పారు. అలాగే సభాపతిగా నేను కూడా ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నాను. వల్లభనేని వంశీ వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తీరాల్సిందేనని స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యానించారు. డిసెంబర్ 2 నుంచి ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ఆ వివరాలను వెల్లడించిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఏపీలో శాసనసభ, శాసన మండలి వ్యవస్థలను డిజిటలైజ్ చేసినట్టు తెలిపారు.
Also read : లేదంటే.. తెలంగాణలోలాగే ఇక్కడ కూడా టీడీపీ మిగలదు: చంద్రబాబుకు వల్లభనేని వంశీ హెచ్చరిక