హైదరాబాద్: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లోని అగ్రహీరోలు అందరితో కలిసి నటించిన వేణు మాధవ్ ఇక లేరనే చేదునిజాన్ని ఆయన కలిసి నటించిన సినీ ప్రముఖులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వేణు మాధవ్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్.. టాలీవుడ్ గొప్ప కమెడియన్ని కోల్పోయిందని చెబుతూ తమ సంతాపాన్ని ప్రకటించింది. వేణు మాధవ్ పార్థివదేహాన్ని సినీ ప్రముఖులు, ఆయన అభిమానుల సందర్శనార్థం గురువారం మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30 గంటల వరకు ఫిలిం ఛాంబర్‌కి తీసుకురానున్నారు. అనంతరం వేణుమాధవ్ నివాసం ఉంటున్న మౌలాలిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రదాన కార్శదర్శి జీవిత రాజశేఖర్ పేరిట ఓ ప్రకటన విడుదల చేశారు.
సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌తో వేణు మాధవ్‌కి మంచి సంబంధాలున్నాయి. అన్ని దశల్లోనూ మా అసోసియేషన్‌తో కలిసి చురుకుగా పనిచేసిన వేణు మాధవ్.. ప్రస్తుత మా అసోసియేషన్‌లో కార్యవర్గ సభ్యుడిగా తన సేవలందించారు.