Success Story: ఇడ్లీ, దోశ పిండితో వేల కోట్లు సంపాదించిన పి.సి ముస్తాఫా సక్సెస్ స్టోరీ ఇదే

ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటే అది నిజమే అని చెప్పవచ్చు. ఎందుకంటే పది రూపాయల కూలీకి పని చేసే ఓ కార్మికుడి కొడుకు ఈరోజు వందల కోట్లకు అధిపతిగా మారాడు. అది కూడా ఏ వ్యాపారం చేశారని ఆశ్చర్యపోతున్నారా…మనందరం ఇంట్లో ప్రతిరోజు చూసే ఇడ్లీ దోశ పిండి అమ్మి, నేడు ఓ కార్పొరేట్ కంపెనీకి బాసుగా ఎదిగాడు. అతడు మరెవరో కాదు ఐడి ఫ్రెష్ ఫుడ్ సీఈవో పి.సి ముస్తఫా అతని సక్సెస్ ఫుల్ స్టోరీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


 

1 /7

PC Musthafa Success Story: ముస్తఫా కేరళలోని వాయనాడ్‌ జిల్లా చెన్నలోడ్ గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు నిరుపేదలు రోజుకు పది రూపాయలు కూలీకి వెళ్లి పని చేసేవారు. అడవిలో కట్టలు కొట్టి వాటిని అమ్మి జీవనభృతి కొనసాగించేవారు. వారితో పాటు చిన్నారి ముస్తఫా సైతం అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకునే వాడు. అయితే ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ ముస్తఫా చదువు పట్ల ఏమాత్రం అశ్రద్ధ వహించలేదు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగాడు.  

2 /7

అతని చిన్నతనంలో ఓసారి వారి కుటుంబమంతా కలిసి జమ చేసిన 150 రూపాయలతో ఓ మేకను కొనుక్కున్నారు ఆ తర్వాత దాని పెంచి అమ్మిన తర్వాత మరికొంత డబ్బు పోగు చేసి ఒక ఆవును కొనుక్కున్నారు ఆ ఆవుతోని పాల వ్యాపారం ప్రారంభించి వారి కుటుంబం కాస్తా స్థిరపడేందుకు ఉపయోగపడింది. పాల వ్యాపారమే అతడిలో వ్యాపారం చేయడం పట్ల నమ్మకాన్ని పెంచింది.   

3 /7

ఆరో తరగతి ఫెయిల్ అయిన ముస్తఫా ఆ తర్వాత పట్టుదలతో తన పాఠశాల విద్యను పూర్తి చేసి, ఆపై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)లో ఇంజనీరింగ్ చదివాడు. IT ఉద్యోగం సంపాదించిన తర్వాత, అతను కార్పొరేట్ ప్రపంచంలో వ్యాపార మెళకువలు నేర్చుకున్నాడు. మోటరోలా కంపెనీలో ఒకటిన్నర సంవత్సరాలు పనిచేశాడు. ఆ తరువాత సౌదీకి వెళ్లి అక్కడ సిటీ బ్యాంక్‌లో పనిచేశాడు.  

4 /7

అప్పట్లో నెలకు 3 లక్షలు సంపాదించేవాడు. అయినప్పటికీ జన్మభూమిపైన మమకారంతో 2003లో స్వదేశానికి తిరిగివచ్చాడు. మళ్లీ చదువు కొనసాగించాలని నిర్ణయించుకొని IIM బెంగళూరులో MBAలో చేరి పూర్తిచేశాడు. ఇక ఉద్యోగం బదులు బిజినెస్ చేయాలని నిర్ణయించుకొని 2005లో, తన నలుగురు కజిన్స్‌తో కలిసి కేవలం రూ. 50,000తో ID ఫ్రెష్ ఫుడ్స్‌ సంస్థను ప్రారంభించాడు.   

5 /7

మొదటి అవుట్‌లెట్ బెంగళూరులో 50 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రారంభించాడు, ముస్తఫా ప్రతిరోజూ 100 ప్యాకెట్ల ఇడ్లీ పిండిని విక్రయించాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి అతడికి తొమ్మిది నెలలు సమయం పట్టింది.   

6 /7

ముస్తఫా తన వ్యాపారాన్ని విస్తరించడానికి కేరళలోని తమ భూమిని విక్రయించాడు. 550 చదరపు అడుగుల ఔట్ లెట్ తీసుకున్నాడు. ఏడాదిలోనే ఇడ్లీ పిండిని 300 దుకాణాల్లో ప్రతిరోజూ 2000 కిలోలు అమ్మడం ప్రారంభించాడు. బెంగుళూరులో ఇడ్లీ, దోశ పిండి సక్సెస్ అవడంతో ముస్తఫా హైదరాబాద్, ముంబై సహా 10 కొత్త నగరాలకు వ్యాపారాన్ని విస్తరించాడు. 2014 నాటికి, ID ఫ్రెష్ ఫుడ్స్ దుబాయ్‌కి విస్తరించింది. హీలియన్ వెంచర్స్ అనే సంస్థ భారీ పెట్టుబడి పెట్టింది. 2015 నాటికి కంపెనీ రూ.100 కోట్ల ఆదాయాన్ని అందుకుంది.   

7 /7

2023 నాటికి, ID ఫ్రెష్ ఫుడ్స్ రూ. 500 కోట్ల టర్నోవర్‌ను సాధించింది, ఆరు మెగా ఫ్యాక్టరీలలో ప్రతిరోజూ 2,50,000 కిలోల ఇడ్లీ, దోశ పిండిని విక్రయిస్తోంది. ఐడీ ఫుడ్స్ మొత్తం 800 మంది ఉపాధి కల్పించింది.