ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం అరెస్ట్ అయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరంను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికొచ్చిన సీబీఐ, ఈడీ అధికారులను వ్యక్తిగత సిబ్బంది అడ్డుకోవడంతో కాసేపు హైడ్రామా నడిచింది. దాదాపు గంట హైడ్రామా అనంతరం సీబీఐ అధికారులు చిదంబరంను అరెస్ట్ చేశారు.
సీబీఐ ఆర్థిక నేర విభాగ జాయింట్ డైరెక్టర్ ఢిల్లీ పోలీసుల సహకారంతో చిదంబరాన్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం కారులో సీబీఐ ప్రధాన కార్యాలయానికి ఆయన్ను తరలించారు. ఐఎన్ఎక్స్ మీడియాలో కేసులో ఈ రాత్రికి సీబీఐ అధికారులు చిదంబరాన్ని ప్రశ్నించే అవకాశముంది. కాగా రేపు ఉదయం సీబీఐ కోర్టులో ఆయన్ను హాజరుపర్చనున్నట్లు తెలిసింది.
ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించిన అవినీతి కేసుల్లో చిదంబరం నిందితుడిగా ఉన్నారు. ఆయనపై మనీ ల్యాండరింగ్ కేసు కూడా నమోదు చేశారు. దీంతో ఈ కేసును సీబీఐతో పాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది. దీంతో అరెస్ట్ చేస్తారని గ్రహించిన చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ఢిల్లీ హైకోర్టులో అపీల్ చేశారు. అయితే ఆయన అభ్యర్థనను ఢిల్లీ న్యాయస్థానం కొట్టేసింది.
ఈ క్రమంలో చిదంబరంను అరెస్ట్ చేసేందుకు సీబీఐ, ఎంఫోర్స్ మెంట్ అధికారులు సిద్ధంగా ఉండగా... ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కూడా ఆయన బెయిల్ పిటిషన్ను నిన్న అత్యవసరంగా విచారించడానికి అంగీకరించలేదు. ఈ రోజు మరోమారు పిటిషన్ దాఖలు చేయడంతో విచారించేందుకు సుప్రీంకోర్టు మళ్లీ నిరాకరించింది. దీంతో ఆయన అరెస్ట్ కు లైన్ క్లియర్ చేసుకున్న సీబీఐ ...పగడ్భంధీ వ్యూహంతో ఆయన నివాసం వద్ద కాపాలా కాసి మరి చిదంబరంను అరెస్ట్ చేసింది.