Edla polala Amavasya 2024: శ్రావణంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య లేదా ఎడ్ల పోలాల అమావాస్యగా పిలుస్తుంటారు. ఈరోజున ముఖ్యంగా ఎడ్లను పూజించుకుంటారు.
మనదేశంలో అనాదీగా అనేక ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తున్నాం. మనం చేసే పూజల వెనుక కూడా నిగుఢమైన అర్థం దాగి ఉంటుంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో అనేక పండుగలు వరుసగా వస్తుంటాయి. ఈ మాసంలో నాగుల పంచమి, ఎడ్లపొలాల అమావాస్యలు కూడ వస్తాయి.
చాలా మంది పాములంటే మనకు అపకారం తలపెడుతుందని భావిస్తారు. కానీ అది మన పంటలను, బియ్యంను పాడుచేసే ఎలుకల్ని వేటాడి తింటుంది. ఇండైరెక్ట్ గా అది మనకు మంచి చేస్తుంది. అదే విధంగా ఆవులు, ఎడ్లు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయి. రైతన్నలకు ఎడ్లు.. తమ కుటుంబ సభ్యులకన్నా.. కూడా ఎక్కువగా వ్యవసాయంలో ఆసరాగా ఉంటాయి.
శ్రావణ మాసంలోని అమావాస్యను ఎడ్లపొలాల అమావాస్యగా చెబుతుంటారు. ఈ సారి సెప్టెంబర్ 02వ తేదీన అంటే శ్రావణ మాసంలో చివరి రోజున సోమవారం నాడు పోలాల అమావాస్య వచ్చింది. ఈ సందర్భంగా ఈ పవిత్రమైన రోజున శుభ ముహుర్తం ఎప్పుడొచ్చింది.. ఈరోజు వ్రతాన్ని ఎలా ఆచరించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
శ్రావణ అమావాస్య తిథి సెప్టెంబర్ 02న తెల్లవారుజామున 5:20 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు అంటే 3 సెప్టెంబర్ 2024 మంగళవారం 8:35 గంటలకు ముగియనుంది. ఈ క్రమంలో.. ఉదయం తిథి ప్రకారం, సెప్టెంబర్ 2వ తేదీన అమావాస్యను జరుపుకోనున్నారు. ఈ అమావాస్య సోమవారం రోజున వచ్చింది కాబట్టి ఈ అమావాస్యను సోమవతి అమావాస్య అని కూడా అంటారు.
ఎడ్లపొలాల అమావాస్య రోజున ఉదయాన్నేలేచి స్నానాదులు పూర్తిచేసుకొవాలి. ఇంటిని శుభ్రం చేసుకుని దేవాలయంలో దీపం పెట్టుకొవాలి. కొంతదర ఈరోజు మట్టితో ఎడ్లు తయారు చేసుకుంటారు. మరికొందరు కుమ్మరి వాళ్లు మట్టితో ఎడ్లను తయారుచేసి అమ్ముతుంటారు. వీరి వద్ద నుంచి కొనుగోలు చేస్తారు.
ఈ ఎడ్లను పీటల మీద పెట్టి పూజలు చేసి, ఆ తర్వాత పూలతో అలంకరణ చేయాలి. పింటి వంటలు చేసి, ఎడ్లకు నైవేద్యంగా సమర్పించుకుంటారు. ఆ తర్వాత ఇంట్లో కనుక నిజమైన ఎడ్లు ఉన్న వారు, రైతులు తమ ఎడ్లకు స్నానాలు చేయించి, అందంగా అలంకరిస్తారు.ఆ తర్వాత ఆ ఎద్దులను ఊరంతా తిప్పుతారు.ఆ రోజు ఎడ్లతో ఎలాంటి పనులు కూడా చేయించరు. ఎడ్లను సంపదగా,లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు.
అంతేకాకుండా పూజ పూర్తయిన తర్వాత చాలా మంది వాయనాలు కూడా ఇప్పించుకుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు, ఇంట్లో వాళ్లకు ఉన్న దోషాలు అన్నిపోతాయని చెబుతుంటారు. ఈ జన్మలోనే కాకుండా పూర్వజన్మలోచేసుకున్న పాపాలు సైతం పోతాయని నమ్ముతుంటారు.
దీనివెనుక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒక బ్రాహ్మణ మహిళకు ప్రతిఏడా పిల్లలు పుడుతున్నారు. ఆ తర్వాత ఏడాదికే పొలాల అమావస్య కు మరణిస్తున్నారు. ఇలా జరుగుతుంటే.. ఆమె పొచమ్మ ఎదుక కన్నీళ్లు పెట్టుకుంటుంది. గత జన్మలో.. ఈ మహిళ.. మహిళలకు వాయినాలు ఇవ్వకముందే.. పిల్లలు ఏడ్చారని.. వాయనాలు ఎంగిలిచేస్తుంది. అందుకే పిల్లలు చనిపోతుంటారు. అప్పుడు తప్పును తెలుసుకొని అమ్మవారికి దండం పెట్టుకొవడం వల్ల మరల జన్మించిన పిల్లలు అమ్మవారి దయ వల్ల ఆరోగ్యంగా ఉంటారు.