న్యూఢిల్లీ: గౌతం గంభీర్ శుక్రవారం బీజేపీలో చేరారు. కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో గౌతం గంభీర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పార్టీలో చేరిన సందర్భంగా అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ.. గౌతం గంభీర్ పార్టీలో చేరిన ఘటనను ఓ కీలకమైన ఘట్టంగా అభివర్ణించారు. ఇటీవలే క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన గౌతం గంభీర్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో గౌతం ఏదైనా ఒక లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
పార్టీలో చేరిన అనంతరం గౌతం గంభీర్ మీడియాతో మాట్లాడుతూ.. దేశం కోసం ఏదైనా చేయాలనుకుంటున్న తాను ఇది ఒక సదవకాశంగా భావిస్తున్నట్టు తెలిపారు.