ఆస్ట్రేలియాతో భారత్ ఆడుతున్న 2వ టెస్టు 2వ రోజు ఆట ముగిసింది. శనివారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్ మురళీ విజయ్ డకౌట్ కాగా మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 2 పరుగులకే ఔట్ అయిన అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (82 పరుగులు నాటౌట్: 181 బంతుల్లో 4X5), వైస్ కెప్టెన్ అజింక్య రహానె (51పరుగులు నాటౌట్: 103 బంతుల్లో 4X6, 6X1) జట్టుకు భారీ స్కోర్ అందించే ప్రయత్నం చేశారు. విరాట్ కోహ్లీ - అజింక్య రహానే జోడీ 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియా ఒకింత సేఫ్ జోన్‌లో నిలిచింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా 172 పరుగులు చేయగా.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసిస్ కన్నా ఇంకా 154 పరుగులు వెనుకంజలో ఉంది. అంతకన్నా 2వ రోజు ఆట ప్రారంభంలో 277/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియాను టీమిండియా 326 పరుగులకే ఆలౌట్ చేసింది.
ఆసిస్ ఆలౌట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు కంగారూలు ఆదిలోనే గట్టి షాక్ ఇచ్చారు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఓపెనర్ మురళీ విజయ్ (0) డకౌట్ అవగా.. కేఎల్ రాహుల్ కేవలం 2 పరుగులకే హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. కేఎల్ రాహుల్ వ్యక్తిగత కెరీర్ విషయానికొస్తే, తన చివరి పది ఇన్నింగ్స్‌ల్లో రాహుల్ ఇలా క్లీన్ బౌల్డ్ అవడం ఇది ఆరోసారి. చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ ఇద్దరూ కలిసి కాసేపు టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేశారు. జట్టు స్కోర్ బలపడుతుందనుకుంటున్న తరుణంలోనే జట్టు మొత్తం స్కోర్ 82 పరుగులకు చేరిన క్రమంలో మిచెల్ స్టార్క్ వేసిన బంతిని హిట్ ఇవ్వబోయి కీపర్ పైన్‌కు క్యాచ్ ఇచ్చి పుజారా సైతం పెవిలియన్ బాటపట్టాడు.
చటేశ్వర్ పుజారా తర్వాత క్రీజులోకి వచ్చిన అజింక్య రహానె.. వచ్చీరావడంతోనే 22 బంతుల్లో 23 పరుగులు చేశాడు. అనంతరం నెమ్మదిగా ఆడతూ మొత్తం 6 ఫోర్లు, 1 సిక్స్‌తో చెలరేగిపోయాడు. రహానేతో కలిసి కాస్త దూకుడు పెంచిన విరాట్ కోహ్లీ ఈ క్రమంలోనే తన టెస్ట్ కెరీర్‌లో 20వ హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. కోహ్లీ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న కొద్దిసేపటికే రహానె సైతం తన ఖాతాలో మరో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2, హేజిల్‌వుడ్ 1 వికెట్ పడగొట్టారు. 2వ రోజు ఆట మొత్తంలో భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ (4 /41) అద్భుతంగా రాణించాడు. బుమ్రా, ఉమేశ్ యాదవ్, హనుమ విహారి తలో 2 వికెట్లు దక్కించుకున్నారు.