న్యూఢిల్లీ: నేటి సాయంత్రం 5 గంటలకు రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో మొత్తం ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిసినట్టయింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడంతో వివిధ సంస్థలు ఆయా ఐదు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల గెలుపు ఓటములపై నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సైతం ఒక్కొక్కటిగా విడులవుతున్నాయి. చత్తీస్ఘడ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాల విషయానికొస్తే, ఓటర్లు కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ కట్టబెట్టనున్నట్టు న్యూస్ 24- పేస్ మీడియా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ స్పష్టంచేస్తున్నాయి. న్యూస్ 24- పేస్ మీడియా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 45-51 స్థానాలు రానుండగా బీజేపీ 36-42 స్థానాలు మాత్రమే సొంతం చేసుకోనుందని తెలుస్తోంది.
ఇక ఇదే చత్తీస్‌ఘడ్‌లో ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే, బీజేపీకి 40-50 స్థానాలు రాగా, కాంగ్రెస్ పార్టీకి 30-38 స్థానాలు, జేసీసీ పార్టీ 6-8 స్థానాలు కైవసం చేసుకోనున్నట్టు సమాచారం.