హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అభివృద్ధి పేరిట ప్రతీ పథకంలోనూ అవినీతికి పాల్పడి కేసీఆర్ కుటుంబం భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం నిజామాబాద్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. నిజామాబాద్ వేదికపై నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణలో గత నాలుగన్నరేళ్లు పాలించిన టీఆర్ఎస్ పార్టీలపై విమర్శల జోరు పెంచారు. ఇదే క్రమంలో కేసీఆర్ పాలనపై విమర్శలు చేస్తూ.. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలకు పేరు మార్చడం తప్ప తెలంగాణకు కేసీఆర్ కొత్తగా చేసిందేమీ లేదని అన్నారు. అంతేకాకుండా అవే పాత పథకాలకు కొత్తగా అంచనాలు పెంచి.. అందులోనూ కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. అందుకే కేసీఆర్ అనే పేరుకు అర్థం 'ఖావో కమిషన్ రావు' అని కేసీఆర్ని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ కేంద్రంలో ప్రధాని మోదీ తీసుకొచ్చిన అన్ని పథకాలను కేసీఆర్ సమర్థిస్తూ వచ్చారని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆరోపించారు. అంతేకాకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్లను సమర్థించిన టీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ పేరును టీ-ఆర్ఎస్ఎస్ అని పెట్టుకుంటే బాగుంటుందని మండిపడ్డారు.