హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం మూడు జిల్లాల్లో కలియతిరుగుతూ ఆరుచోట్ల టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించనున్న ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొననున్నారు. శుక్రవారం వరకు ప్రచారంతో బిజీబిజీగా గడిపిన కేసీఆర్ శనివారం ప్రచారం నుంచి విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఒక్క రోజు విశ్రాంతి అనంతరం ఇవాళ వికారాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనునన్న కేసీఆర్.. తాండూరు, పరిగి, నారాయణపేట, దేవరకద్ర, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ఏర్పాటుచేయనున్న బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు తాండూరులో జరిగే సభతో ఇవాల్టి ప్రచారం షెడ్యూల్ ప్రారంభమవుతుంది. అనంతరం 1:30 గంటలకు పరిగి, 2:30 గంటలకు నారాయణ్‌పేట్, దేవరకొండలో 3:30 గంటలకు, 4:30 గంటలకు షాద్‌నగర్, చివరిగా 5:30 గంటలకు ఇబ్రహీంపట్నంలో జరిగే భారీ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. కేసీఆర్ రాక నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదిలావుంటే, ఇవాళ జరగనున్న సభల్లో కేసీఆర్ ఏం మాట్లాడతారా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అందుకు కారణం ఇటీవల మేడ్చల్‌లో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారీ బహిరంగ సభకు హాజరైన ఆ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ.. టీఆర్ఎస్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టడమే. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేరుగా ప్రజల మధ్యలోకి వచ్చి మాట్లాడనున్నది ఇవాళే కావడంతో.. ఆయన సోనియా గాంధీ విమర్శలకు ఎలా సమాధానం ఇవ్వనున్నారా అనే ఆసక్తి నెలకొని ఉంది.
నేడు 6 సభల్లో పాల్గొననున్న కేసీఆర్ !