సౌతాఫ్రికా క్రికెట్ కెప్టెన్ డుప్లిసెస్, ఆస్ట్రేలియా ఆటగాళ్ళకు కొన్ని సూచనలు చేశాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఆయనను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికాడు. భారత జట్టు ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్తున్న క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ లాంటి ఆటగాళ్లు చాలా అరుదని.. అలాంటి వారికి సైలెంట్ ట్రీట్ మెంట్ మాత్రమే ఇవ్వాలని.. స్లెడ్జింగ్ లాంటి వాటికి పాల్పడి వారిని రెచ్చగొట్టకూడదని తెలిపారు.
సౌతాఫ్రికా ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టెస్టు సిరీస్‌లో 2-1 పాయింట్లతో భారత్‌ను ఓడించినా.. కోహ్లీ మాత్రం టాప్ స్కోరర్‌గానే సిరీస్‌లో నిలవడం గమనార్హం. 3 టెస్టుల్లో ఆయన 286 పరుగులు, 47.66 సగటుతో చేశారు. కోహ్లీ గురించి డుప్లిసెస్ మాట్లాడుతూ "కోహ్లీ బ్యాటింగ్‌కు వస్తున్నాడంటే ఆయన గురించి మేం టీమ్ మొత్తం చర్చించుకుంటాం. తనను ఎలా కట్టడి చేయాలి.. ఎలా ఔట్ చేయాలనే విషయాన్ని ఆలోచిస్తాం. కానీ సాధ్యమైనంత వరకూ సైలెంట్ ట్రీట్ మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అయితే ఆయనకు ఆగ్రహం వస్తే మాత్రం రెచ్చిపోతాడు" అని డుప్లిసెస్ తెలిపారు.
క్రికెట్ విషయంలో స్లెడ్జింగ్ విధానాన్ని క్రికెటర్లు అందరూ ఎంజాయ్ చేస్తారని.. కోహ్లీ కూడా ఎంజాయ్ చేసినా ఆయనకు ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని డుప్లిసెస్ అభిప్రాయపడ్డారు. కానీ ఆయన ఓ అద్భుతమైన ఆటగాడని కితాబునిచ్చారు.