తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)పై లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్రులకు అండగా ఉంటానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై జయప్రకాశ్ నారాయణ్ స్పందించారు. తెలుగు రాష్ట్రాలు ఐకమత్యంగా ఉండాలని చాటి చెబుతూ.. చాలా చక్కగా కేటీఆర్ మాట్లాడారని.. ఆయన మాటలతో తాను ఏకీభవిస్తున్నానని అన్నారు. ఏ పార్టీ అయినా రాజకీయ లబ్ధి కోసం ప్రజలను విభజించడం సరికాదని.. కుల, మత, ప్రాంతాలను బట్టి ప్రజలు కూడా ఓటు వేయకూడదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఈ విషయాలను ఆయన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. కేటీఆర్ కూడా జేపీకి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. గతంలో విశాఖకు జాయింట్ కలెక్టరుగా, ప్రకాశం జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలకు కలెక్టరుగా పనిచేసిన ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ్.. 1996లో లోక్ సత్తా పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి.. తర్వాత అదే పేరు మీద రాజకీయ పార్టీని కూడా స్థాపించారు.
2009లో కూకట్ పల్లి నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికైన జయప్రకాష్ నారాయణ్.. 2014లో మల్కాజ్గిరి నుండి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం నుండి రావాల్సిన నిధుల గురించి నిజ నిర్థారణ కమిటీ వేసినప్పుడు.. జయప్రకాష్ నారాయణ్ కూడా అందులో సభ్యులుగా ఉన్నారు.
Many thanks JP Garu 😊 https://t.co/S7pfmMWEAC
— KTR (@KTRTRS) October 29, 2018