బాబాయ్.. స్ఫూర్తినిచ్చినందుకు ధన్యవాదాలు: రామ్ చరణ్

బాబాయ్.. స్ఫూర్తినిచ్చినందుకు ధన్యవాదాలు: రామ్ చరణ్

Last Updated : Oct 24, 2018, 09:09 AM IST
బాబాయ్.. స్ఫూర్తినిచ్చినందుకు ధన్యవాదాలు: రామ్ చరణ్

తిత్లీ పెను తుఫానుతో శ్రీకాకుళం, విజ‌యన‌గ‌రం జిల్లాలు అత‌లాకుత‌ల‌మైన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. బాధితులను పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తుఫాను కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకుని ఆదుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. తుఫాన్ ప్రభావిత గ్రామాలను చూస్తుంటే బాధగా ఉందని ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని రామ్ చరణ్ ను అడుగుతానని చెప్పారు. కాగా, దీనిపై మెగా పవర్ స్టార్ రాంచరణ్ సానుకూలంగా స్పందించారు. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొనేందుకు ముందుకు వచ్చారు. తుఫాన్ ప్రభావిత గ్రామాలలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోనున్నానని ప్రకటించారు. ఇప్పటికే తన బృందంతో ఈ విషయంపై చర్చించినట్లు..  తమ బృందం ప్రభావిత గ్రామాలలో పర్యటిస్తుందని.. త్వరలో ఏ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుని ప్రకటిస్తామని రామ్ చరణ్ ఒక ప్రకటనలో తెలిపారు.

రామ్ చరణ్ తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో.. 'బాబాయ్ నాకు స్ఫూర్తినిచ్చినందుకు ధన్యవాదాలు!' అంటూ.. తాను చేసిన ప్రకటన పత్రాన్ని కూడా పోస్టు చేశారు. 

 

తిత్లీ తుఫాను బాధితులకు బాలయ్య విరాళం

అటు తిత్లీ తుఫాన్ ప్రభావంతో అతలాకుతలమైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను ఆదుకొనేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు పెద్దఎత్తున ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను ఇదివరకు ప్రకటించిన రూ.25లక్షల రూపాయలకు సంబంధించిన చెక్కును బాలయ్య ఇవాళ హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు. సీఎం సహాయ నిధికి ఇచ్చిన ఈ విరాళాన్ని బాధితుల అవసరాలకు వినియోగిస్తామని సీఎం చెప్పారు.

ఎన్టీఆర్‌, అల్లుఅర్జున్, వ‌రుణ్ తేజ్, విజయ్ దేవరకొండ, క‌ళ్యాణ్ రామ్‌, సంపూర్ణేష్ బాబు, నిఖిల్, కార్తికేయ‌, ద‌ర్శకుడు కొర‌టాల శివ త‌దిత‌రులు తిత్లీ తుఫాను బాధితులకు విరాళాలు ప్రకటించారు. అల్లుఅర్జున్ రూ.25 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ రూ.15 లక్షలు, హీరో కల్యాణ్ రామ్ రూ.5 లక్షలు, విజయ్ దేవరకొండ రూ.5 లక్షలు, కొర‌టాల శివ రూ.3 లక్షలు,  కార్తికేయ రూ.2 లక్షలు, సంపూర్ణేష్ బాబు రూ.50వేలు, వరుణ్ తేజ్ రూ.5 లక్షలు విరాళాలుగా ప్రకటించారు.

Trending News