రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న భారత్-వెస్టిండీస్ రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 367 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 311 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌కు 56 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. విండీస్ బౌలర్లలో కెప్టెన్ హోల్డర్ 5 వికెట్లతో, గాబ్రియెల్ మూడు, రెండు వికెట్లతో రాణించారు.
308/4 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు (ఆదివారం) ఆటను ప్రారంభించిన టీమిండియా.. 14 పరుగుల వ్యవధిలోనే మూడు కీలక వికెట్లను కోల్పోయింది. తొలుత అజింక్యా రహానే (80), తర్వాత రవీంద్ర జడేజా ఔట్ అయ్యారు. రిషబ్ పంత్ (92: 134 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాన్ని చేజార్చుకున్నాడు. చివర్లో అశ్విన్(35), కుల్దీప్(6), ఉమేశ్ యాదవ్(2), ఠాకుర్ (4)లు ఔట్ కావడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
మొదటి ఇన్నింగ్స్ అనంతరం విండీస్ తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే 56 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్.. కడపటి వార్తలందేసరికి 27 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. ప్రస్తుతం సునీల్ అంబ్రీస్(20), జాసన్ హోల్డర్ (కెప్టెన్) (6) క్రీజులో ఉన్నారు.