Spice Jet Toilet incident విమాన ప్రయాణాల్లో తరచూ విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రయాణికుల ప్రవర్తనతో తోటి ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్న విమానం (Flight) ఆలస్యమైందనే కారణంతో ఓ ప్రయాణికుడు సిబ్బందిపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది. విసర్జన కోసం వాష్ రూమ్‌కు వెళ్లగా బాత్రూమ్ తలుపు ఇరుక్కుపోయింది. ఎంతకీ తలుపు తెరచుకోకపోవడంతో బాత్రూమ్ లోనే ప్రయాణం చేసిన దుస్థితి. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసిన విమానయాన సంస్థ ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పి.. ఘటనకు బాధ్యత వహిస్తూ అతడి ప్రయాణ ఖర్చులు తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
జనవరి 16వ తేదీన ముంబై నుంచి బెంగళూరుకు స్పైస్ జెట్ (SpiceJet) విమానం బయల్దేరింది. తెల్లవారుజామున 2.13 నిమిషాలకు ముంబై నుంచి టేకాఫ్ అయ్యింది. ఈ సమయంలో ఓ ప్రయాణికుడు వాష్ రూమ్‌లోకి వెళ్లాడు. లోపలికి వెళ్లాక బాత్రూమ్ తలుపు బిగుసుకుపోయింది. బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా తెరచుకోలేదు. ఎంతకీ తెరచుకోకపోవడంతో కేకలు వేశాడు. దీంతో వెంటనే స్పందించిన విమాన సిబ్బంది తలుపు తెరిచేందుకు ప్రయత్నం చేశారు.
ఎంత ప్రయత్నం చేసినా తెరుచుకపోవడంతో విమాన సిబ్బంది అతడిని కంగారుపడొద్దని సూచించారు. మీకు ఏం కాదని.. ఆందోళన చెందకండి అని సిబ్బంది చెప్పారు. తలుపు గట్టిగా పట్టేయడంతో తెరచుకోవడం లేదని వాస్తవ విషయాన్ని అతడికి చెప్పారు. బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం ౩.10 కు విమానం దిగేంత వరకు కూడా ఆ ప్రయాణికుడు బాత్రూమ్‌లోనే ఉండిపోయాడు. గంటపాటు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
ప్రయాణికుడు చిక్కుకుపోవడంతో విమాన సిబ్బంది ఓ చీటీపై 'సార్ మీరు కంగారుపడకండి. తలుపు తెరిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ తెరచుకోవడం లేదు. కొద్దినిమిషాల్లో మనం దిగబోతున్నాం. ప్రశాంతంగా కూర్చోండి. దిగగానే మా ఇంజనీర్ వచ్చి తలుపు తెరుస్తారు. మీరు ఆందోళన చెందకండి' అని రాసి పంపారు. విమానం దిగిన అనంతరం ఇంజనీర్లు వచ్చి తలుపు తెరిచి ప్రయాణికుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం సిబ్బంది అతడికి క్షమాపణలు కోరారు.
ఈ సంఘటనపై స్పైస్ జెట్ స్పందించి ఓ ప్రకటన విడుదల చేసింది. 'జనవరి 16న దురదృష్టవశాత్తు చిక్కుకుపోయారు. డోర్ లాక్ పడడంతో గంటపాటు తన ప్రయాణం మొత్తం ఆ వ్యక్తి బాత్రూమ్‌లోనే ఉన్నారు. అతడికి మా సిబ్బంది పూర్తిగా సహకరించింది. ఈ సంఘటన జరిగినందుకు చింతిస్తున్నాం. ప్రయాణికుడి ఖర్చులు తిరిగి చెల్లిస్తాం' అని స్పైస్ జెట్ ప్రకటించింది.
Also Read: Chandrababu Case: క్వాష్ కొట్టివేత, ద్విసభ్య ధర్మాసనంలో ఎవరేమన్నారంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter