కడపలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే కాన్వాయ్‌ని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ (ఆర్సీపీ) నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అదే పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్త మంత్రి కాన్వాయ్ పై బూటు విసరడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు కార్యకర్తలను అరెస్టు చేసి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అయితే కార్యకర్తలు పోలీసులను కూడా అడ్డుకోవడంలో వారిని చెదరగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం 365 రోజులుగా తాము ఆందోళన చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని ఈ సందర్భంగా ఆర్సీపీ కార్యకర్తలు తెలిపారు. తాము ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని వారు తెలిపారు. కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే ఆర్అండ్బీ అతిథి గృహం తన కాన్వాయ్‌లో బయలుదేరి రోడ్డు మీదకు రాగానే ఈ సంఘటన చోటు చేసుకుంది. కాన్వాయ్‌ను చుట్టు ముట్టిన కార్యకర్తలు నినాదాలు చేస్తూ.. వాహనాన్ని వెళ్లకుండా ఆపడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు వారిని బలవంతంగా లాగేశారు.
ఈ సంవత్సరం జూన్ నెలలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షాలు పోరాటాన్ని ఉధృతం చేశాయి. ఇందులో భాగంగా కడపజిల్లాలో బంద్‌కు కూడా పిలుపునిచ్చాయి. అదే నెలలో కడప ఉక్కు కర్మాగార సాధనకై రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కూడా ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్న సంగతి తెలిసిందే. అలాగే గత సంవత్సరం కూడా "కడప ఉక్కు - సీమ హక్కు" అనే నినాదంతో ఉక్కు కర్మాగారం సాధన సమితి అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కూడా ప్రొద్దుటూరులో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు.