షాట్ పుట్‌లో భారత్‌కు స్వర్ణం తెచ్చిన తేజేంద్రుడు..!

ఇండోనేషియాలోని జకార్తా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలలో భారత్‌ ఖాతాలో ఏడో బంగారు పతకం చేరింది. 

Last Updated : Aug 26, 2018, 07:27 PM IST
షాట్ పుట్‌లో భారత్‌కు స్వర్ణం తెచ్చిన తేజేంద్రుడు..!

ఇండోనేషియాలోని జకార్తా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలలో భారత్‌ ఖాతాలో ఏడో బంగారు పతకం చేరింది. శనివారం పురుషుల షాట్‌పుట్‌లో తనదైన శైలిలో సత్తా చాటిన తేజిందర్‌పాల్ సింగ్ రికార్డు స్థాయిలో గుండుని 20.75 మీటర్లు దూరం విసిరి పసిడి పతకాన్ని గెలుపొందారు. తొలిసారిగా తన కెరీర్‌లోనే స్వర్ఱ పతకాన్ని కైవసం చేసుకున్నారు. తొలిసారి గుండును 19.96 మీటర్లు, రెండోసారి 19.15 మీటర్లు విసిరిన తేజిందర్ మూడో ప్రయత్నంలో మాత్రం ఆశాజనకమైన ప్రదర్శనను కనబరచలేదు. అయితే నాలుగో సారి మాత్రం 19.96 మీటర్లు విసిరాడు.

ఇక అయిదోసారి 20.75 మీటర్లు విసిరి రికార్డును నమోదు చేశాడు. తద్వారా పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే జాతీయ రికార్డును కూడా తిరగరాశాడు. పంజాబ్‌లోని మోగా జిల్లా ఖోసాపాండో గ్రామానికి చెందిన తేజిందర్‌పాల్ సింగ్ 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా పాల్గొన్నాడు. అయితే అప్పుడు తాను తన ప్రదర్శనతో ఏ విధంగానూ ఆకట్టుకోలేకపోయాడు. అయితే తుర్కెమెనిస్థాన్‌లో జరిగిన ఆసియా ఇండోర్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండో స్థానాన్ని పొందిన తేజిందర్..  జాతీయ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి ఆ తర్వాత మళ్లీ తన మీద తాను నమ్మకాన్ని పెంచుకున్నాడు.

అయితే ఈ స్వర్ణం గెలవడం కోసం ఎంతో కష్టపడ్డారు తేజిందర్. తన తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా.. తాను మాత్రం ఏకాగ్రతను దూరం చేసుకోకుండా ఆట మీదే ధ్యాస పెట్టారు. కోచ్ చెప్పినట్లే నడుచుకొని.. ప్రతీ రోజు ప్రాక్టీసు చేయసాగారు. తన టార్గెట్ మెడల్ మీద లేదని.. జాతీయ రికార్డును బీట్ చేయడం కోసమే తాను కలగన్నానని.. ఈ ఆసియా క్రీడల్లో తన కోరికతో పాటు పసిడి పతకం కూడా దక్కడం సంతోషంగా ఉందని తెలిపారు తేజిందర్. 

Trending News